సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): లోన్లు ఇప్పిస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న పాత నేరస్తుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదు సహా మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్, రోడ్ నం.3కి చెందిన మిర్జా ఖాదిర్ బెయిగ్ అలియాస్ సమర్(35) వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, బులియన్ మార్కెట్ తదితర రంగాలకు చెందిన వ్యాపారులకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని ఖాదిర్బెయిగ్ నమ్మిస్తాడు. వ్యాపారులను నమ్మించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులను నియమిస్తాడు.
గూగుల్ ద్వారా ట్యాక్స్ కన్సల్టెంట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బులియన్, నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించిన నంబర్లను సేకరిస్తాడు. అనంతరం వారికి కాల్స్ చేసి ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్‌పై పెద్ద మొత్తంలో లోన్లు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతారు. ఇది నమ్మి అతడి బుట్టలో పడిన బాధితుల వద్ద నుంచి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, లీగల్ చార్జీలు తదితర కోటి రూపాయల లోన్‌కు 3.5శాతం చొప్పున వివిధ రకాల చార్జీలు వసూలు చేస్తాడు. అనంతరం లోన్ మంజూరు కావడానికి 90 నుంచి -120 రోజుల సమయం పడుతుందని నమ్మిస్తాడు. ఈ 120 రోజుల మధ్య కాలంలో చాలా మంది నుంచి చార్జీల కింద లక్షల రూపాయలు వసూలు చేసి 120 రోజులు ముగిసేలోపు బిచాణా ఎత్తేస్తాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 17న ఒక వ్యక్తికి రూ.5కోట్లు రుణం ఇప్పిస్తానంటూ నమ్మించి, అతడి వద్ద నుంచి రూ.6,75,000 వసూలు చేశాడు. ఇప్పటికే నిందితుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో 9 నాన్‌బెయిలెబుల్ వారెంట్లు, భద్రాద్రికొత్తగూడెంలో ఒక ఎన్బీడబ్ల్యూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు నిందితుడిపై పలు స్టేషన్లలో మొత్తం 21 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 9కేసులు జూబ్లీహిల్స్ పీఎస్‌లో, 12 కేసులు సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి పీఎస్‌లో నమోదయ్యాయి. అంతే కాకుండా రెండు డౌరీ కేసులు సైతం నిందితుడిపై నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈనెల 19న మిరాజ్ ఖాదిర్బెయిగ్ను అరెస్టు చేసి, 20న రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష నగదుతో పాటు మొత్తం రూ.8లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకృష్ణ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రఘునాథ్, ఎస్ఐ నవీన్‌కుమార్ ఈ కేసును ఛేదించారు.