దౌల్తాబాద్, ఆగస్టు 19 : పేట-కొడంగల్ ఎత్తిపోతలపై ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు బుధవారం మండల పరిధిలోని గోకఫసల్వాద్ గ్రామ శివారులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ అనిత హాజరై రైతులతో ఎత్తిపోతల పథకంపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈర్లపల్లి గ్రామంలోని అమ్మ చెరువు దగ్గర నిర్మించే ట్యాంకు కోసం 469.33 ఎకరాల భూమి, ఎత్తిపోతల పథకం కోసం 1539 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు వివరించారు. ఇందులో 1000 ఎకరాలు కాలువల కోసం, మరో 950 నుంచి 1000 ఎకరాల భూమిని ఇతరవాటి కోసం సేకరిస్తున్నట్టు తెలిపారు.
అంతకు ముందు గ్రామ జీపీఓ పద్మ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా రైతులు కోల్పోతున్న భూముల సర్వే నెంబర్లను రైతులకు వివరించారు. గ్రామంలోని చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నామని, అందుకోసం కనీసం రూ.40 లక్షల ఆర్థిక సాయమందించాలని రైతులు కోరారు. రైతు మల్లేశ్ మాట్లాడుతూ.. లగచర్ల రైతుల మాదిరిగానే మా గ్రామ రైతులకు కూడా రూ:25 లక్షల పరిహారంతోపాటు ప్లాటు, ఓ ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని కోరారు. మరో రైతు తమ భూముల వివరాలు ఆన్లైన్లో చూపించడం లేదని అధికారులకు తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలను తెలుపుతుండగా.. అక్కడే ఉన్న ఓ కాంగ్రెన్ కార్యకర్త లేచి తన భూమికి సంబంధించిన మాట ముందు వినాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ కాస్తా ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. మరికొందరు రైతులు తమకున్న భూముల కన్నా తక్కువగా రికార్డుల్లో నమోదైనట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అంతా కాంగ్రెస్ నేత కనుసన్నల్లో అభిప్రాయ సేకరణ
రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో అధికారులు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత చెప్పినట్లు తలూపడం అక్కడికి వచ్చినవారికి స్పష్టంగా అర్థమైంది. ఆ నేతకు ఎలాంటి హోదా లేకున్న అధికారులతోపాటు సభా వేదికపై కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఉన్నా.. వారందరిని కాదని అతడిని సభా వేదికపై ఆహ్వానించడంలో అధికారులు ఉత్సుకతను ప్రదర్శించారు. అనంతరం కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. తాను సర్పంచ్ బిడ్డగా రైతుల తరపున ప్రతి రైతుకు కనీసం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులను కోరారు. దీనిపై రైతులు భిన్నంగా స్పందించారు. ప్రాజెక్టు కింద అతడి భూమి ఏదైనా పోతే రైతుల బాధ అర్థమయ్యేదని, అసలు భూమే పోనప్పుడు అతడికి పరిహారం విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు.
అడుగడుగునా పోలీసులు
బుధవారం జరిగిన రైతుల అభిప్రాయ సేకరణకు పోలీసులు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతులు తమ పాసు బుక్కులు చూపితేనే అనుమతినిచ్చారు. మరికొందరు తమ వద్ద పాత పాసు పుస్తకాలు మాత్రమే ఉన్నాయని, కొత్తవి లేవని చెప్పిన వారిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. కొంతమంది రైతులు తమ భూములు కోర్టు కేసులో ఉన్నాయని అధికారులకు విన్నవించుకుంటామన్న కూడా వినలేదని వాపోయారు. మేమేమన్న తీవ్రవాదులమా, దొంగలమా అంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం : ఆర్డీవో అనిత
పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గ్రామంలో జరిగిన భూ సేకరణపై రైతుల అభిప్రాయం విన్నామని, అధికారులు వారి విన్నపాలను రాసుకున్నారని చెప్పారు. రైతులు సూచించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రికార్డుల్లో పేర్లు తప్పుగా ఉన్నా, అసలు పేర్లే లేకున్నా కోర్టు పరిధిలో ఉన్న భూములైనా.. ప్రతి రైతు తమ అభిప్రాయాలు, సమస్యలను తెలిపేందుకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను అక్కడికి వచ్చి నేరుగా లేదా రాతపూర్వకంగా తెలియజేయవచ్చన్నారు. అందరి సమస్యలు విని పూర్తి వివరాలు పరిశీలించాకే పరిహారం అందజేస్తామని చెప్పారు.
ఎక్కువ పరిహారం అందేలా చూడాలి
మండలంలో జరిగే అభివృద్ధికి బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుపడదని, కానీ రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం. గ్రామంలో జరిగిన అభిప్రాయ సేకరణలో వారు చెప్పిన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామంలోని రైతులకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. అందుకని అధికారులు వారి పరిస్థితిని దృష్టిలొ పెట్టుకుని పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడాలి. రైతులకు భూమి తప్ప మరో ఆధారం లేదని తెలిసినా అభివృద్ధి కోసమని వారు తమ భూములను అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అలాంటి రైతులకు వీలైనంత వరకు ఎక్కువ పరిహారం అందేలా చూడాలి.
– బీఆర్ఎస్ నేత కేశవరెడ్డి