వరుణుడు కరుణించకపోవడంతో మొలకెత్తిన మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. విత్తనాలు నాటే సమయానికే వర్షాలు కురవడంతో నాటిన రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలను నాటి నెల రోజులు దాటినా పంటలకు సరిపడా ఒక్క భారీ వర్షం కురవకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చి సాగు చేయగా మొలకెత్తిన మొక్కలు కళ్ల ముందే ఎండుతుంటే తట్టుకోలేని రైతులు పంటలను బతికించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ఉదయం నుంచి పొద్దుపోయే వరకు ఇంటిల్లిపాది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి బిందెలతో నీటిని తీసుకువచ్చి బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మరో వారం, పది రోజులకు కూడా సరిపోను భారీ వర్షాలు కురవకపోతే ప్రస్తుతం మొలకెత్తిన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇంకా 30 శాతం మేర అన్నదాతలు విత్తనాలను నాటేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వారం, పది రోజుల వరకు పత్తి, మొక్కజొన్న పంటల విత్తనాలను నాటొచ్చని, అదును దాటితే నాటిన పంటలు నష్టపోయే పరిస్థితులే ఎక్కువని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
– వికారాబాద్, జూలై 10, (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ఆయా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.94 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు జిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో ఆయా పంటలను జిల్లా రైతాంగం సాగు చేసింది. అత్యధికంగా 2.04 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా., 82 వేల ఎకరాల్లో కందులు, 18,665 ఎకరాల్లో మొక్కజొన్న పంటలను అన్నదాతలు సాగు చేశారు. జిల్లాలో అత్యధికంగా సాగైన పత్తి పంట పరిస్థితి అయోమయంగా ఉన్నది. పత్తి విత్తనాలను నాటి నెలరోజులైనా మొలకెత్తడం తప్ప ఎదుగుదల మాత్రం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు వానదేవుడికి మొక్కుతూ, మరోవైపు మొలకెత్తిన పంటను బతికించుకునేందుకు బిందెలతో నీటిని అందిస్తూ కష్టాలు పడుతున్నారు. విత్తనాలకు, ఎరువులకు తెచ్చిన అప్పు మీద పడేటట్టుందని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే పత్తి, మొక్కజొన్న, కంది పంటలకు సంబంధించి విత్తనాలను నాటేందుకు మిగతా అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఆయా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 5.94 లక్షల ఎకరాలుకాగా, ఇప్పటివరకు జిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో ఆయా పంటలను సాగు చేయగా.. అత్యధికంగా 2.04 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి, 82 వేల ఎకరాల్లో కందులు, మొక్కజొన్న 18,665 ఎకరాలు, పెసలు 6268 ఎకరాలు, జొన్న 1065 ఎకరాలు, మినుములు 3365 ఎకరాలు, సోయాబీన్ 543 ఎకరాలు, ఇతర పంటలు 2351 ఎకరాల్లో జిల్లా రైతాంగం ఇప్పటివరకు సాగు చేసింది.
జిల్లాలో లోటు వర్షపాతం నమోదయ్యింది. వానకాలం ప్రారంభ సమయంలో ఒకట్రెండు భారీ వర్షాలు మినహా చెప్పుకోదగిన వానలు కురవలేదు. అయితే జూన్ నెలలో కేవలం 8 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. జూన్‌లో జిల్లాలోని పది మండలాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారం, రెండో వారంలో అడపాదడపా కురిసిన వర్షాలకు అన్నదాతలు విత్తనాలను నాటారు. తదనంతరం జూన్ చివరి వారం నుంచి వాన జాడ లేకుండా పోయింది. దీంతో జిల్లాలో జూన్ నెలలో సాధారణం కంటే 27 మి.మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది.
జూన్‌లో సాధారణ వర్షపాతం 114.2 మి.మీ కాగా, 83.3 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ప్రధానంగా మర్పల్లి, మోమిన్‌పేట, నవాబుపేట, వికారాబాద్, ధారూరు మండలాల్లో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలోనూ రెండో వారం వచ్చిన వర్షాలు లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. ఈ నెలలో ఒక్క భారీ వర్షం కూడా లేకపోవడంతో ఇప్పటివరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. గత వారం రోజులుగా ప్రతిరోజూ మేఘాలు కమ్ముకుంటూ వర్షం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది.