వికారాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వెంటనే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే రూ.2016 పింఛన్ డబ్బును రూ.4వేలకు, దివ్యాంగులకిచ్చే రూ.4016 పింఛన్ డబ్బులను రూ.6వేలకు పెంచుతామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అమలుకు నోచుకోవడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలు, ఒకట్రెండు పథకాల గురించి మినహా మిగతా హామీల గురించి ఇప్పటివరకు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు పెంచుతామని హామీనిచ్చినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.
కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటేసి గెలిపించిన ఆసరా పింఛన్‌దారులు పింఛన్ల పెంపెప్పుడో అంటూ ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కొత్త పింఛన్లను జారీ చేస్తామని హామీనిచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం ప్రజావాణిలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. పింఛన్ల కోసం జిల్లావ్యాప్తంగా కొత్తగా 30 వేలకుపైగా లబ్ధిదారులు ఎప్పుడెప్పుడు మంజూరు చేస్తారో ఎదురుచూస్తున్నారు.
పింఛన్ల పంపిణీలోనూ జాప్యం
ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆందోళన మొదలైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని పింఛన్‌దారులకు పింఛన్ డబ్బుల పంపిణీ ప్రతీ నెల 20 లేదా 24న ప్రారంభమై వారం రోజుల్లో అందజేస్తుండగా.. కొడంగల్ నియోజకవర్గంలోని పింఛన్‌దారులు మాత్రం పింఛన్ డబ్బుల కోసం మొదటి వారం పూర్తయ్యే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతీ నెల 20వ తేదీలోపు పింఛన్లను అందజేసేది. కొడంగల్ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరవుతుండగా, మిగతా వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1.07 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.26 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు.