బొంరాస్పేట, అక్టోబర్ 13 : ఆర్థికంగా వెనుకబడి, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉప కార వేతనాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వంలోని మానవ వనరుల శాఖ 2008లో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని ప్రారంభించింది. స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనం అందించడంతో పాటు డ్రా పౌట్స్ ను నివారించి వారు ఉన్నత విద్యను కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. మెరిట్ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థులకు కేంద్రం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12 వేల చొప్పున రూ.48 వేలు ఉపకార వేతనంగా అందజేస్తుంది. ప్రభుత్వ లేదా ఏయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో అర్హత పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28వ తేదీ చివరి తేదీ. చదువులో చురుకుగా ఉన్న నిరుపేద విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ఉపకార వేతనం పథకానికి దరఖాస్తు చేయడానికి అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల సంవత్సర ఆదా యం రూ.3.50 లక్షలకు మించరాదు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వే షన్లు అమలు చేస్తారు. ఏడవ తరగతిలో 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం సడలింపు ఉంటుంది. విద్యార్థి స్కాలర్షిప్కు ఎంపికైన సమ యంలో 8వ తరగతిలో కూడా 55 శాతం మార్కులను పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 శాతం మినహాయింపు ఉంటుంది. విద్యార్థులు ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారు అనర్హులు. ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదవాలి. లేకుంటే ఉపకార వేతనం అందజేయరు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 12వ తేదీన అర్హత పరీక్షను నిర్వహిస్తుంది. మొత్తం 180 మా ర్కులకు 180 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష మూడు గంటల వ్యవధి ఉంటుంది. 8వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థుల వివరాలను కేంద్రానికి పంపిస్తే వారు విద్యార్థుల ఖాతాలో (9వ తరగతి నుంచి ఇంటర్ వరకు) ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనాన్ని జమచేస్తారు.