ఖైరతాబాద్, జూన్ 17 : ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 70 అడుగుల్లో రూపుదిద్దుకోనున్నది. ఈ నేపథ్యంలో నిర్జల ఏకాదశి తిథిని పురస్కరించుకొని సోమవారం సాయంత్రం కర్రపూజ మహోత్సవాన్ని వినాయక విగ్రహ ఏర్పాటు మండపం వద్ద వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ వేడుకలను ప్రారంభించారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తైన మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. త్వరలోనే నమూనా విడుదల చేస్తామన్నారు.
వినాయక చవితికి వారం రోజుల ముందే స్వామివారి విగ్రహం సిద్ధమవుతుందన్నారు. కర్ర పూజలో పాటు గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన తామే నిర్వహిస్తామంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీలు వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో సభ్యుల మధ్య కొత్త వివాదానికి తెరలేపింది. అయితే సోమవారం జరిగిన కర్రపూజ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇరు వర్గాలతో చర్చించి.. సభ్యులందరూ సంయుక్తంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. అందుకు సభ్యులందరూ అంగీకరించగా, ఎలాంటి గొడవకు తావు లేకుండా కర్రపూజ సజావుగా సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. ప్రస్తుతం అడ్హక్ కమిటీగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, రెండు మూడు రోజుల్లో సభ్యులందరితో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సారి గణపతిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదాన్ని అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
ఖైరతాబాద్ గణేశుడికి 70 ఏండ్ల చరిత్ర ఉన్నది. 1954లో ఒక్క అడుగుతో ప్రారంభించి.. సుమారు 60 అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఏడాది 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టగా, గణేశుడిని 70 అడుగుల్లో ప్రతిష్ఠించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో మొదటిసారిగా 70 అడుగుల విగ్రహానికి అంకురార్పణ జరిగింది. పీవోపీ వినియోగించకుండా పూర్తిగా మట్టితో తయారు చేసిన ప్రతిమను ప్రతిష్ఠిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమిటీ కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు, కోశాధికారి శశిధర్, టాస్క్ఫోర్స్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్, ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి రాజ్ కుమార్, సందీప్ రాజ్, మహేశ్ యాదవ్, మహేందర్ బాబు, కృష్ణయాదవ్, మధుకర్ యాదవ్, వి.ప్రవీణ్, పృథ్వీరాజ్, నాగేశ్, రాంరెడ్డి, భాస్కర్ అశోక్, రాజేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.