Sri Rama Navami : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వతాపూర్ గ్రామం పరిధిలోని సాయిప్రియ నగర్ కాలనీలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ (ఆదివారం) శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోడ్ నెంబర్ 3 లోని రామాలయంలో శ్రీ సీతారామ స్వామి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువలా కల్యాణోత్సవం జరిగింది. అధ్యక్షుడు పులగం వెంకట్రెడ్డి నేతృత్వంలో కాలనీ కార్యవర్గ సభ్యులు అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణోత్సవాన్ని జరిపించారు. సీతమ్మ తల్లిని, రాములవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా అలంకరించారు.
బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలు, బాజా బజంత్రీలతో సీతమ్మ, రామచంద్రస్వామి వార్ల కల్యాణం కమనీయంగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీతమ్మ, రామయ్యల కల్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. కల్యాణోత్సవం అనంతరం సీతారామచంద్రస్వాములకు నారీ కేళాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కుకున్నారు. సీతారాముల దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత కాలనీ వాసులు ఆనందోత్సాహాలతో సీతారాముల ఊరేగింపు నిర్వహించారు.