శామీర్‌పేట, ఏప్రిల్ 5 : గ్రామ పంచాయతీలకు కార్మికుల సమ్మె సెగ తగిలింది. గత 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టారు. విధులు పక్కన బెట్టి పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతుందగా అలియాబాద్‌లో వంట వార్పుతో సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల పరిధిలోని కార్మికులకు రాష్ర్ట, జిల్లా కమిటీ తరఫున శనివారం సంఘీభావం తెలియజేస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యూనియన్ కార్యదర్శి శ్రీనివాస్‌లు తెలిపారు. పంచాయతీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి, మాట తప్పాడని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవోలకు, జిల్లా డిపివోలకు, కలెక్టర్, పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్లకు వినతి పత్రం అందశామని తెలిపారు. 5 నెలలుగా జీతాలు రాని తప్పని పరిస్థితుల్లో దిక్కుతోచని పంచాయతీ కార్మికులు సమ్మె బాటలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జీతాలు ఇచ్చేంత వరకు మూడు చింతలపల్లి, శామీర్‌పేట మండలాల్లో సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.