సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సైబర్‌నేరగాళ్లు పార్ట్‌టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో నగరానికి చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు. ఈ ఘటన మరవక ముందే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ సంస్థ ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌కు రూ. 2.28 కోట్లు టోకరా వేశారు. సుమారు సంవత్సరం పాటు సైబర్‌నేరగాళ్లతో బాధితుడు టచ్‌లో ఉంటూ 638 సార్లు బ్యాంకు ఖాతాలకు డబ్బు లావాదేవీలు నిర్వహించాడు. ఇలా ప్రతి రోజూ సైబర్ నేరగాళ్లు రూ. 3 కోట్ల వరకు సైబర్ దోపిడీ చేస్తున్నారు.
మీర్పేట్ ప్రశాంతి హిల్స్‌లోని బాధితుడు ఒక మల్టీనేషనల్ కంపెనీకి ప్రిన్సిపల్ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నాడు. 2023, ఫిబ్రవరిలో అంతర్జాతీయ నెంబర్‌తో వచ్చిన కాల్స్‌కు స్పందించలేదు. మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి డబ్బులు వస్తాయని మెసేజ్‌లు పెట్టారు. ఆ తరువాత వాట్సాప్‌కు ఎక్స్పర్ట్మార్కెట్ట్రేడ్ 247.కామ్, ఎక్స్పర్ట్మార్కెట్ఇన్వెస్ట్289.కామ్ వెబ్సైట్లను పంపించి అందులో డ్యాష్‌బోర్డును పరిశీలించాలని సూచించారు. దీంతో బాధితుడు వాళ్ల మాటలు నమ్మి రూ. 5 వేలు, రూ. 20 వేలు పెట్టుబడి పెట్టడంతో వాటికి లాభాలు ఇచ్చారు. ఇలా సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు వింటూ 638 సార్లు ఆయా బ్యాంకు ఖాతాల నుంచి రూ. 2.28 కోట్లు సైబర్ నేరగాళ్లకు పంపించాడు. వడ్డీలు ఇస్తాం, అసలు ఇస్తామంటూ కాలయాపన చేస్తూ బాధితుడి వద్ద నుంచి అందినకాడికి సైబర్‌నేరగాళ్లు దోచేశారు. ఈ మోసంపై రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రవిబాబు కేసు దర్యాప్తు చేపట్టారు.
నల్లకుంటకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఉందని సిమిలర్వెబ్సేల్స్-ఇంటెలిజెన్స్.కామ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఒక రౌండ్లో 35 ప్రొడక్ట్స్ ఉంటాయని వాటికి రివ్యూ రాయాలని సూచించారు. ఇందుకు 0.75 శాతం కమీషన్ వస్తుందని నమ్మించారు. దీనికి బాధితుడు మొదట రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి, మొదటి రౌండ్ పూర్తి చేయడంతో రూ. 46600 వచ్చాయి. ఇలా దఫ దఫాలుగా రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బీటెక్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి వాట్సాప్‌కు పార్ట్‌టైమ్ జాబ్ రోజూ రూ. 5 వేలు సంపాదించవచ్చని మెసేజ్ వచ్చింది. దానిని చూసిన ఆమె సైబర్‌నేరగాళ్లు సూచించినట్లు టెలిగ్రామ్ గ్రూప్‌లో చేరింది. ప్రతి రోజూ 25 టాస్క్‌లు ఇస్తామని కొన్ని వెబ్సైట్ లింక్‌లు పంపించారు. వాటిని క్లిక్ చేయడంతో మీ టాస్క్ పూర్తియ్యిందని రూ. 300 పంపించారు. దీంతో ఆమెకు నమ్మకం కలుగడంతో ప్రీ పెయిడ్ టాస్క్‌ల పేరుతో ఐదు వేలు పెట్టుబడి పెడితే 30 శాతం లాభం కలిపి పంపించారు. ఆమెకు నమ్మకం కుదిరాక దఫ దఫాలుగా రూ. 20 లక్షలు పెట్టుబడి పేరుతో కాజేశారు. బాధితురాలు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.