ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 2 : మా ఇంట్లో మా కూతురు.. కుమారుడి పెండ్లి.. మీరు కుటుంబసమేతంగా తప్పనిసరిగా హాజరు కావాలి. పెండ్లి పత్రికలోని తేదీని జర యాది పెట్టుకోండి.. అంటూ ఆప్యాయంగా అందించే పెండ్లి పత్రిక పలకరింపు మారింది. పెండ్లి పత్రికల స్థానంలో సోషల్ మీడియాను ఆదరిస్తూ ఆహ్వానాలు పంపుతున్నారు. దీంతో వాట్సాప్, ఇన్స్ట్రాలు పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఆహ్వానాలకు వేదికలవుతున్నాయి. ఒకప్పుడు మేళతాళాలతో బంధువులిండ్లకు తిరుగుతూ.. బొట్టుపెట్టి పెండ్లి ఆహ్వాన పత్రికను అందజేసి పిలిచేవారు. పత్రిక తీసుకువెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టుపెట్టి పెండ్లి పత్రికను తలుపునకు కట్టేవారు.
ఈ ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా.. చాలా చోట్ల మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పాత సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నారు. గతంలో ఒక్కో పెండ్లికి వేల సంఖ్యలో కార్డులు ప్రింట్ చేయించిన కుటుంబాలు ఇప్పుడు నామమాత్రంగా వందల్లోనే ప్రింట్ చేయిస్తున్నాయి. ఆ కొద్దిపాటి కార్డులను సోషల్ మీడియాలో గ్రూపులను ఏర్పాటు చేసి పోస్ట్ చేస్తూ బంధువులు, స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. పెండ్లితో పాటు చిన్నచిన్న శుభకార్యాల ఆహ్వానాలకు కూడా సోషల్ మీడియా వేదికగా మారుతున్నది. సోషల్ మీడియా రాకముందు ఓ వెలుగు వెలిగిన ప్రింటింగ్ ప్రెస్‌లు వెలవెలబోతున్నాయి.
సోషల్ మీడియా ప్రభావం లేనప్పుడు పెండ్లి పత్రికలపై సీతారాముల ఫొటోలు తప్పనిసరిగా ఉండేవి. ఇందులో సీతాదేవి వరమాలతో సిగ్గులొలుకుతూ నిలబడితే రాములవారు కోదండధరుడై ఓరచూపులతో సీతాదేవిని చూస్తుండేవారు. క్రమంగా వారి స్థానంలో వధూవరులు వచ్చి చేరడంతోపాటు పెండ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి ఫొటో స్టూడియోలకు మారాయి. ఇంటింటికీ తిరిగి ఆహ్వానం పలికేరోజు నుంచి వాట్సాప్, ఇన్స్ట్రా, మెయిల్ రూపంలో ఆహ్వానాలు అందే రోజులు వచ్చాయి. ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయగానే వధూవరుల పేర్లు, ఫొటోలతో పాటు సినిమా పాటల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పెండ్లి తేదీ, స్థలం వీడియో రూపంలో వచ్చేస్తున్నది. సమయం లేకపోవడంతో అందరినీ వ్యక్తిగతంగా కలువలేకపోతున్నాం. ఇదే ఆహ్వానంగా భావించండి.. తేదీ సేవ్ చేసుకోండి.. అంటూ వీడియోలో చెప్పేస్తున్నారు.
బ్రాహ్మణులు లగ్న పత్రిక రాసింది మొదలు పెండ్లి సందడి మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. మెహిందీ, సంగీత్, మంగళస్నానాలు, పెండ్లి, బరాత్, డిన్నర్ ఫంక్షన్ ఇలా ప్రతి కార్యక్రమానికీ వాట్సాపే వేదికగా మారుతున్నది. పెండ్లి జరుగుతున్న ఇంటివారి పేరుతో ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు తయారుచేసి బంధువుల నంబర్లు అందులో చేర్చి.. పెండి ్లసందడి పూర్తి ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తూ పెండ్లి వేడుకలకు మరింత ఆనందాన్ని జోడిస్తున్నారు.
కొన్నేండ్లుగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీంతో పెండ్లిళ్లకు కార్డులను ప్రింట్ చేయించేవారి సంఖ్య తగ్గింది. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలుకుని పెండ్లి పత్రికలను సైతం స్టూడియోల్లోనే ప్రింట్ చేయిస్తున్నారు. దీంతో మాలాంటి ప్రింటింగ్ ప్రెస్వాళ్లకు పనిలేకుండా పోయింది. గతంలో రెండు వేల పత్రికలను ప్రింట్ చేయించేవారు. ప్రస్తుతం 200లతోనే సరిపెట్టుకుంటున్నారు. తొట్టెలు, గృహ ప్రవేశాలు, పుట్టినరోజు, పుట్టుపంచెలు.. ఇలా ప్రతి శుభకార్యమూ గతంలో పత్రికల రూపంలో ఉండేవి. కాని, ఇప్పుడు అన్ని ఆహ్వానాలకు వాట్సాప్ వేదికైంది.
– మోహన్‌రెడ్డి, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు