Shabad | షాబాద్, మార్చి 22: షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి.
మండలంలోని కుమ్మరిగూడ, లింగారెడ్డిగూడ, సాయిరెడ్డిగూడ, షాబాద్, ముద్దెంగూడ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కుమ్మరిగూడ గ్రామానికి చెందిన పోనమోని కుమార్ అనే రైతు తన ఎనిమిది ఎకరాల పొలంలో వేసిన మామిడితోటలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పూలతోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఆకాల వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.