మల్కాజ్గిరి, మార్చి 16: హిందు శ్మశానవాటికను డంప్ యార్డుగా మార్చడం హేయమైన చర్య అని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మచ్చ బొల్లారంలోని శ్మశానవాటిక స్థలాన్ని రాంకీ – జీహెచ్ఎంసీ చెత్త డంప్ యార్డుగా మార్చినందుకు నిరసనగా స్థానిక కాలనీల వాసులతో కలసి ఆదివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డంప్ యార్డు వల్ల దుర్గందంతోపాటు వాతావరణం కాలుష్యం అవుతుందన్నారు. గతంలో హిందు శ్మశానవాటిక కోసం కేటాయించిన స్థలాన్ని రాంకీ – జీహెచ్ఎంసీ సిబ్బంది ఆక్రమించుకుని చెత్త డంప్ యార్డుగా మార్చారని ఆరోపించారు.
ప్రతిరోజు దాదాపు 110ఆటో ట్రాలీలలో చెత్తను రెండు ట్రిప్‌లలో చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారని మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డంప్‌యార్డ్ వల్ల చుట్టు పక్కల కాలనీల వాసులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇక్కడ చెత్త వేయవద్దని కోరారు. డంప్ యార్డును తరలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రమేష్, అనిల్‌కిశోర్, పరమేష్, చరణ్గిరి, శోభన్‌బాబు, ఉదయ ప్రకాష్, దిలీప్, సుధాకర్, ఆనందరావు, ప్రవీణ్, సురేష్, అమరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సహరేవ్, శ్రీనివాస్‌రావు, కవిత, పుష్ప తదితరులు పాల్గొన్నారు.