శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 01:04:34

‘రైటర్ల’కు లైసెన్స్‌లు

‘రైటర్ల’కు లైసెన్స్‌లు

త్వరలో పరీక్షలు నిర్వహించి అర్హులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం..

 రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో       600ల మంది ప్రస్తుత, పాత రైటర్ల గుర్తింపు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద దస్తావేజులను తయారు చేసే డాక్యుమెంట్‌ రైటర్లకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లైసెన్స్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఎంతమంది రైటర్లు ఉన్నారో..? వివరాలు పంపాలంటూ సబ్‌ రిజిస్ట్రార్లకు ఈనెల 17న ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే లైసెన్స్‌లు ఉండి రైద్దెన వారి వివరాలనూ ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భూములు, ఇతర రిజిస్ట్రేషన్లలో దస్తావేజు రైటర్ల పాత్ర ప్రధానమైనది. వీరి వ్యవస్థ రాక ముందు గ్రామాల్లో పోలీసు పటేళ్లు, పట్వారీలు దస్తావేజులు తయారు చేయగా వాటి ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 22 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుండగా.. ఇందులో రంగారెడ్డిలో 18, వికారాబాద్‌లో 4 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ దాదాపు 600 నుంచి 700 మంది రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, హైదరాబాద్‌ మహానగరంలో 12 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం మూడు జిల్లాల్లో కలిపి 2వేల మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నట్లు అంచనా. 

మళ్లీ లైసెన్సుల జారీకి ఏర్పాట్లు..

  డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ తొలిసారిగా 1972లో రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అర్హత గల వారిని ఎంపిక చేసి లైసెన్స్‌లు జారీ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న ఈ వ్యవస్థను విమర్శల నేపథ్యంలో 1992లో రద్దు చేశారు. అయినప్పటికీ లెసెన్స్‌లు లేకపోయినా ఆ రంగంలో ఆసక్తి ఉన్న  రైటర్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.200ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవడం ద్వారా డాక్యుమెంట్లను తయారు చేస్తుండేవారు. ఇలా కొంతకాలం కొనసాగాక 2002లో అప్పటి ప్రభుత్వం ఆ పద్ధతిని కూడా రద్దు చేసి, డాక్యుమెంట్‌ తయారీలో ఉన్న నిబంధనలన్నీ తొలగించింది. దీంతో రైటర్లుగా ఆసక్తి ఉన్న వారందరూ ఆ రంగంలోనే స్థిరపడ్డారు. ఇప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు సంబంధించిన డాక్యుమెంట్ల తయారీలో వీరంతా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

ఇవి షరతులు.. 

   లైసెన్స్‌ పొందిన డాక్యుమెంట్‌ రైటర్లు విధిగా సంబంధిత రిజిస్టర్లు, రశీదు పుస్తకాలు ,ఇతర రికార్డులు నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారుల నుంచి నిర్ణయించిన రుసుం కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయరాదు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయ సిబ్బందితో చట్ట విరుద్ధ లావాదేవీలు, వ్యవహారాలు చేయకూడదు. ఏదైనా న్యాయస్థానం నుంచి లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి బర్తరఫ్‌, సస్పెండ్‌ అయిన వారు లైసెన్స్‌ పొందడానికి అనర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్టాంపు వెండర్‌గా ఉన్నా లైసెన్స్‌ పొందేందుకు అర్హత ఉండదు. 

వివరాల సేకరణ పూర్తి 

  లైసెన్స్‌లు జారీ చేసే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్‌ రైటర్ల వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఈనెల 17వ తేదీన రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద ఉన్న రైటర్ల వివరాల నివేదికను అందించారు. రంగారెడ్డి జిల్లాలో కూకట్‌పల్లి కేంద్రంగా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, వనస్థలిపురం, ఎల్బీ నగర్‌, చంపాపేట, హయత్‌నగర్‌, అబ్ద్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌ పేట, మహేశ్వరం, శంషాబాద్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌, ఫరూఖ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు ఉన్నాయి. 

అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాలి

కర్నె శివప్రసాద్‌, డాక్యుమెంట్‌ రైటర్‌, చేవెళ్ల  

డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం శుభపరిణామం. అయితే అనుభవం ఉన్న ప్రతి ఒక్క రైటర్‌కు విధిగా లైసెన్సులు ఇవ్వాలి. నోటిఫికేషన్‌ ద్వారా లైసెన్సు ప్రక్రియ చేపడితే కొత్త వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనీసం 20 ఏండ్లుగా దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారిని ఆదుకోవాలి. లైసెన్సుతో బాధ్యత పెరుగుతుంది. ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద పది మంది ఆధారపడి ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలి.