వికారాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సర్వే కోసం రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగిలా ప్రదక్షిణలు చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. భూముల కొలతల్లో వచ్చే తేడాలతోపాటు తగాదాలను పరిష్కరించుకునేందుకు భూసర్వే తప్పనిసరి కావడంతో తమ భూములకు హద్దులను నిర్ణయించాలని, సర్వే చేయాలని అధికారులను ఆశ్రయిస్తున్నారు. భూముల సర్వే నిమిత్తం ఆన్లైన్లో చలా న్లు చెల్లించి సర్వేకు దరఖాస్తు చేసుకొని సర్వేయర్లు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు హద్దులను గుర్తిస్తారో అం టూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. అయి తే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూముల సర్వేలను చలాన్లు చెల్లించిన రెండు, మూడు రోజుల్లోనే పూర్తి చేస్తున్న అధికారులు.. సామాన్యులను మాత్రం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు. జిల్లాలో 20 మండలాలుండగా కేవలం సగం మండలాలకు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు.
భూముల సర్వేకు సంబంధించి అధిక మొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భూముల కొలతల్లో వచ్చిన తేడాలను గుర్తించి సరిచేసేందుకు సర్వే కు దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో భూక్రయవిక్రయాలు పెరుగడంతోపాటు ఆన్‌లైన్‌తోపాటు భూకొలతల్లో చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి. కొం దరు రైతులకు రికార్డుల్లో భూమి ఎక్కువుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం తక్కువగా ఉంటున్నది. మరికొంతమందికి క్షేత్రస్థాయిలో భూమి తక్కువగా ఉంటే, రికార్డుల్లో మాత్రం ఎక్కువగా చూపిస్తున్నది.
దీంతో పక్క పక్కన పొలాలున్న రైతు ల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా భూముల కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో, ఆన్లైన్లో భూకొలతల్లో తేడా లు కనిపిస్తుండడంతో తప్పనిసరిగా సర్వేకు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో ఆర్ఎస్ఆర్ సమస్య లేని గ్రామాల్లేవని రెవెన్యూ ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు. భూము ల సర్వేతోనే భూముల కొలతల్లో హెచ్చు, తగ్గులు పరిష్కారం అవుతాయని పేర్కొంటున్నారు. భూముల కొలతల్లో క్షేత్రస్థాయిలో, ఆన్లైన్లో తేడాలుండడంతో రైతులు తమ భూములను విక్రయించాలని చూసినా అమ్ముడుపోని పరిస్థితి నెలకొన్నది.
రైతులు భూముల సర్వేకు సంబంధించి మీ సేవలో చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకుంటే తదనంతరం సంబంధిత దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకుంటాయి. దరఖాస్తులను పరిశీలించి వరుస క్రమంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి భూములను కొలిచి హద్దులను నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ, కొందరు సర్వే యర్లు ఎవరైతే డబ్బులిస్తారో వారి భూములనే మొదట సర్వే చేయ డం, వరుసక్రమంలో ముందు న్నా పేద రైతుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, జిల్లా లో పెండింగ్‌లో ఉన్న 2500 దరఖాస్తుల్లో అత్యధికంగా పేద రైతులవే ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో భూముల సర్వేకు సంబంధించి సిబ్బంది కొరత వేధిస్తున్నది. జిల్లాలోని సగం మండలాలకు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. జిల్లాలో 20 మండలాలుండగా 10 మండలాలకు మాత్రమే సర్వేయర్లున్నారు. మిగతా మండలాలకు వారికే అదనపు బాధ్యతలను అప్పగించారు. కొందరు సర్వేయర్లు రియల్టర్ల భూముల సర్వే విషయంలో ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేసి రిపోర్టు అందజేస్తుండగా.. రైతులను మాత్రం నెలల తరబడిగా తప్పించుకుంటున్నారని పలువురు బాధిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.