సర్వర్ డౌన్‌తో జిల్లాలో భూము ల రిజిస్ట్రేషన్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. గత నెల రోజులుగా సాంకేతిక సమస్యలతో దాదాపుగా పది వేల వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అన్నదాతలు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): సాంకేతిక సమస్యలతో అన్నదాతలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత నెల రోజులుగా సర్వర్‌లో సమస్య తలెత్తడంతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు రెవెన్యూ సమస్యల పరిష్కారం జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. దీంతో రైతులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో వినతిపత్రాలను అందించడంతోపాటు స్థానిక రెవెన్యూ అధికారులకూ విజ్ఞప్తులు చేస్తున్నారు.
పెళ్లిళ్లు, అనారోగ్య పరిస్థితులు, ఇతర అత్యవసర పరిస్థితు ల నిమిత్తం భూముల విక్రయాలకు సిద్ధమవుతున్న రైతులు గత నెలరోజులుగా సర్వర్ డౌన్ సమస్య తో గంటల తరబడి తహసీల్దార్ కార్యాలయా ల వద్ద నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం కొంతమేర సమస్య పరిష్కారమైందని సంబంధిత అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మా త్రం రైతులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
జిల్లాలో గత నెల రోజులుగా సర్వన్ డౌన్ సమస్యతో రెవెన్యూ సమస్యలు పెరిగిపోయాయి. అవి దాదాపుగా పది వేల వరకు ఉన్నాయి. దీంతో వాటి పరిష్కారానికి అన్నదాతలు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. త్వరగానే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా ఇప్పటివరకు పది శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో అత్యధికంగా కలెక్టర్‌తోపాటు తహసీల్దార్ల లాగిన్లోనివే కావడం తో.. రైతన్నలు ప్రతి సోమవారం కలెక్టర్‌లో జరిగే ప్రజావాణిలో విన్నవిస్తున్నారు.
మరోవైపు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల్లో అధికంగా టీఎం-33(డేటా కరెక్షన్) దరఖాస్తు లే ఉన్నాయి. టీఎం-33 అనంతరం ఆర్ఎస్ఆర్ సమస్యతో మ్యుటేషన్, సక్సేషన్ తదితర ఏ మ్యాడ్యూల్లోనూ దరఖాస్తు చేసుకున్నా అధికారులు తిరస్కరిస్తున్నారు. అయితే ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నట్లు తప్పుగా ఎంట్రీ కావడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది.
దీని పరిష్కారానికి రైతులు తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాత రికార్డుల ప్రకారం సంబంధిత సర్వే నంబర్లో ఏ రైతుకు ఎంత భూమి ఉందనే వివరాలను తెలుసుకొని ఆర్ఎస్ఆర్ సమస్యను పరిష్కరించవచ్చు, కానీ, రికార్డుల్లోనూ తప్పుగా ఎంట్రీ కావడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ల రిపోర్టు కీలకంగా మారింది. ఇదే అదునుగా భావిస్తున్న జిల్లాలోని పలువురు తహసీల్దార్లు రిపోర్టులు పంపించడంలో అవినీతికి పాల్పడుతున్న ట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. కిందిస్థా యి సిబ్బందితో కుమ్మక్కై వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దరఖాస్తులు సక్రమంగా ఉన్నా వారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే పలువురు తహసీల్దార్లు ఏదో ఒక కొర్రీ పెడుతూ రిజెక్టు అయ్యే లా ఉన్నతాధికారులకు రిపోర్టులు పంపిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
తహసీల్దార్ల అక్రమ ఆర్జనపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల ఓ రైతు తన పేరు తప్పుగా ఎంట్రీ కావడంతో టీఎం-33 కింద దరఖాస్తు చేసుకోగా.. ఆ మండలానికి చెందిన రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేయగా.. సదరు రైతు ఇవ్వకపోవడంతో ఆ అధికారి ఉన్నతాధికారులకు కొర్రీలు పెడుతూ రిపోర్టును పంపించడంతో అది రిజెక్టు అయ్యింది. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి అతడికి వచ్చింది.