‘బలవంతంగా భూములను సేకరించడం తగదు.. భూమి విలువ రైతుకే తెలుస్తది.. సీఎం రేవంత్‌రెడ్డికి ఏం తెలుసు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే చూస్తున్నడు..’ అని దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలెపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తిలోని సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయొచ్చుగా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండి కాదు.. దుద్యాలకు వచ్చి చూడాలని, సీఎంకు రాజకీయ ఎదుగుదలకు కారణమైన కొడంగల్‌పై ఇంత ద్వేషమెందుకని నిలదీస్తున్నారు. ఫార్మా కంపెనీ అని ముందుగా ప్రచారం చేసి ఇప్పుడు పరిశ్రమల హబ్ అంటూ మాట మార్చడం సరికాదని దుమ్మెత్తిపోస్తున్నారు. పది నెలలుగా అవస్థలు పడుతున్నామని, కలెక్టర్, అధికారులకు పలుమార్లు విన్నవించినా.. రాత్రి సమయంలో డ్రోన్లతో సర్వేలు చేయిస్తున్నారని బాధిత రైతులు మండిపడుతున్నారు.
– కొడంగల్, నవంబర్ 22
‘సీఎం రేవంత్‌రెడ్డికి భూముల విలువ తెల్వదు.. రైతు బిడ్డవైతే తెలుస్తది.. ఏ భూమిలో ఏ పంట పండుతదో తెలిసేది.. మొదటి నుంచి ‘రియల్’ వ్యాపారంపై అవగాహన ఉన్న సీఎంకు తొండలు గుడ్లు పెట్టని భూములు ఎలా తెలుస్తాయి..’ అని ఫార్మా బాధిత రైతులు పేర్కొంటున్నారు. గతంలో రెండు పర్యాయాలు కొడంగల్ ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఇక్కడి ప్రజలనే పీడిస్తావా.. గ్రామాలకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచిస్తున్నారు. కొడంగల్ స్థితిగతులపై పట్టులేని సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకుల మాటలే వేదంలా అనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాస్తవాలను గ్రహిస్తే నిజాలు ఏమిటోఅర్థమవుతాయని, కక్షగట్టి భూములను లాక్కోవద్దని వాపోయారు.
వేములవాడలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి కోసం భూ సేకరణ అని, తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను మాత్రమే తీసుకుంటున్నామని వేములవాడ దైవం రాజన్న సాక్షిగా మాట్లాడడం సీఎం రేవంత్‌కే చెల్లిందని బాధిత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పచ్చటి పొలాలు ఉన్న ప్రాంతాన్ని ఈ విధంగా వక్రీకరించి మాట్లాడడం రైతులను హేళన చేసినట్లుగా ఉన్నదని బాధను వ్యక్తం చేశారు. ఏండ్ల కాలంగా వరి, కంది, పత్తి, వేరుశనగ వంటి ఎన్నో పంటలను సాగు చేసుకుని జీవిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌లో ఉండి కాదు.. కొడంగల్‌కు వచ్చి ఈ ప్రాంతాన్ని చూస్తే వాస్తవమేమిటో సీఎం రేవంత్‌రెడ్డికి అర్థమవుతుందని.. రైతులు పేర్కొంటున్నారు. పచ్చటి పంట పొలాలతో ఆనందంగా ఉన్న ప్రాంతంపై విషం చిమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. నిజానికి తొండలు గుడ్లు పెట్టే పరిస్థితే ఉంటే బాధపడేవారం కాదని, కష్టపడి భూములను చదును చేసుకొని మాగాణిని చేసుకుని బంగారు పంటలు పండిస్తున్నామని రైతులు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామం కల్వకుర్తిలోని కొండారెడ్డిపల్లిలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయొచ్చుగా అని దుద్యాల మండలంలోని రైతులు ప్రశ్నించారు. సీఎం ఊరు ఏమో పచ్చగ ఉండాలె.. కొడంగల్ ప్రాంతమేమో కాలుష్యంతో ఆగం కావాలా.. ఇదెక్కడి న్యాయమని పేర్కొన్నారు. రైతుల ఆవేదనను దాడిగా చిత్రీకరించి రాజకీయంగా కక్షసాధించడంపై సామాన్య రైతులం, ప్రజలం బలి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, రైతుల మధ్య పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే ఈ విధంగా జరిగేది కాదని, ఇంత జరిగినప్పటికీ సీఎం స్పందించడం లేదని తెలిపారు. స్థానికంగా ఉండే అధికారులు, కాంగ్రెస్ నాయకులను మధ్యవర్తులుగా చేసి భూమిని సేకరించడం సమంజసం కాదన్నారు. నియోజకవర్గానికి వచ్చినప్పుడు రైతులను కలువాలని సీఎంకు ఎందుకనిపించడం లేదని వాపోతున్నారు.
రైతులు, గిరిజనులు అంటే అంత చులకనా..? వ్యవసాయం చేస్తే భూమి ఎట్లుంటుందో తెలుస్తది. నోటికి వచ్చింది మాట్లాడితే ఎట్లా.. మా బతుకును ఆగం చేసినవ్.. మేం ఓటు వేయలేదా..? ఇక్కడికి వచ్చి కండ్లు తెరిచి చూస్తే పచ్చటి పంట పొలాలు కనిపిస్తయ్.. తొండలు గుడ్లు పెట్టే భూములు కావు. ఇక్కడి భూములకు ఎంతో డిమాండ్ ఉన్నది.. మీరు ఇస్తానంటున్నది ఎంత.. హైదరాబాద్‌లో ఉండి మాట్లాడితే కాదు.. మా తండాకు వచ్చి చూడు సారూ.. మా బతుకులు ఎట్ట ఉన్నయో అర్థమవుతుంది.
– చాందీబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూములు ఇవ్వబోమని ముక్తకంఠంతో చెబుతున్నా.. సేకరణకు చర్యలు ఎందుకు తీసుకొంటున్నారని బాధిత రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పచ్చగా ఉండే ప్రాంతాన్ని ఫార్మా కంపెనీల ఏర్పాటుతో కాలుష్యాన్ని నింపాలని సీఎం చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇక్కడి భూములే కావాలా.. వేరే ప్రాంత భూములు పనికిరావా.. అంటూ ఆగ్రహిస్తున్నారు.
మా భూములకు మార్కెట్లో రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర ఉంటే రూ.30లక్షలు చెల్లిస్తామనడం ఏమిటీ..? ఆ డబ్బులతో వేరేచోట ఇదే డిమాండ్ ఉన్న భూమి వస్తదా..! కొనే పరిస్థితి ఉన్నదా.. అంటూ బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. పుట్టిన నాటి నుంచి వ్యవసాయంపైనే జీవిస్తున్నామని పేర్కొంటున్నారు. విలువైన భూములను వదులుకొని, ఎక్కడ జీవించాలి.. ఎవరి పంచన బతకాలని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇందిరమ్మ పేదలకు బతుకమని భూమి ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేడు భూములను లాక్కోవడం ఏమిటని వాపోతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రజల అభీష్టాన్ని గుర్తించి మసలుకోవాలని వేడుకుంటున్నారు.
సీఎం రూ.30లక్షల వరకు ఇస్తామంటున్నడు. అదే రైతులతో నేరుగా మాట్లాడితే మాకు ఏం కావాలో చెబుతాం.. ఎవరో వచ్చి ఇంత ఇస్తాం.. అంత ఇస్తాం.. మీకు ఇల్లు వస్తది.. ఉద్యోగం వస్తది.. అంటే మాకు నమ్మకం ఏమిటీ.. భూమి పోతే మేం బతకలేము. వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నం. ఉద్యోగం ఇస్తామంటే మాకు సదువులేదు. ఉద్యోగంతో కొంతకాలం బతుకుతాం. ఆ తరువాత ఎట్లా.. మీరిచ్చే పైసలకు ఎక్కడనన్న భూమి కొనగలమా.. మాకు ఫార్మా వద్దు.. మా భూములను లాక్కోవద్దు..
– ముత్యాలీబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం