గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నది. అంతేకాకుడా మాతా శిశు సంరక్షణకు గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌ను అందించాలని ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ముందుగా ఎనిమిది జిల్లాల్లో ప్రారంభించి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది.
గర్భిణుల్లో రక్తహీనత నిర్మూలన కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను అందజేస్తున్నది. గర్భిణిగా నిర్ధారణ అయిననాటి నుంచే వైద్యారోగ్య శాఖ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. గ్రామాల నుంచి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చేందుకు అమ్మఒడి పథకం ద్వారా వాహనాన్ని ఏర్పాటు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వాహనాల్లో ఇంటికి పంపిస్తున్నది. అత్యవసర సమయంలో వసతులున్న దవాఖానలకు తరలించేందుకు 108 సేవలనూ వినియోగిస్తున్నది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులను నియమించడంతో పాటు ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత వల్ల మాతా, శిశువు మృత్యువాత పడుతున్నారని గ్రహించి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. బిడ్డ గర్భంలో పెరుగుతున్న సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకుంటునే తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారు. కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 376 కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు రాగా, ఇప్పటికే 276 కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను గర్భిణులకు అందజేశారు.
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లో ఉండే వస్తువులు…
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌లో రెండు వేల విలువ చేసే పదార్థాలు ఉన్నాయి. కిలో ఖర్జూర, రెండు ఐరన్ సిరప్ బాటిళ్లు, రెండు హార్లెక్స్ బాటిళ్లు ఉన్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యేవరకు రెండు సార్లు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గర్భిణులకు 5వ నెల, 9వ నెలలో మొత్తం కిట్లను అందజేస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌ను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. బయట మార్కెట్లో డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితి. పేదల ఆరోగ్యం కోసం మెరుగైన వైద్యంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తుండడం సంతోషకరం.
– శారద, కులకచర్ల
కిట్ చాలా బాగుంది..
రక్తహీనతను తగ్గించేందుకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్‌ను అందజేయడం సంతోషకరం. ఈ పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలు క్షేమంగా ఇంటికొస్తున్నారు.
– జ్యోతి, కులకచర్ల
గర్భిణులకు ఎంతో ఉపయోగం
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్ గర్భిణులకు చాలా ఉపయోగపడుతున్నది. రూ.2వేలు విలువ చేసే న్యూట్రీషియన్ పదార్థాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉన్నది.
– వాజిహుద్దీన్, మండల వైద్యాధికారి కులకచర్ల
376 కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు వచ్చాయి..
కులకచర్ల మండలానికి 376 కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లు వచ్చాయి. ఇప్పటికే 276 న్యూట్రీషియన్ కిట్లను గర్భిణులకు అందజేశాం. మండలంలో గర్భిణులను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– చంద్రప్రకాశ్, సీహెచ్‌వో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం