చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పాత్రికేయుడిపై దాడి చేయడం అమానుషమని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ట్రైనీ ఎస్సై మహేశ్వర్‌రెడ్డి పాత్రియుడిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం పలువురు నేతలు, స్థానిక, వివిధ మండలాల ఫ్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, టీయూడబ్ల్యూజే నాయకులు చేవెళ్ల ఇంద్రారెడ్డి చౌరస్తా నుంచి షాబాద్ చౌరస్తా వరకు నల్లబ్యాడ్జీలు, ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అనంతరం చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ సామాన్యుడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన విలేకరిపై ట్రైనీ ఎస్సై మహేశ్వర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కాలర్ పట్టుకుని స్టేషన్లోకి తీసుకెళ్లి లాకప్‌లో వేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.
జర్నలిస్టు అయితే ఏంటని మాట్లాడడం సరికాదన్నారు. ట్రైనీగా ఉన్న ఎస్సై ఇలా ప్రవర్తించే.. ప్రొబేషనరీ పీరియడ్ అయ్యాక ఎలా ప్రవర్తిస్తాడో అర్థం చేసుకోవచ్చన్నారు. సమాజ సేవ చేస్తున్న జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎస్సైని సర్వీస్ నుంచి తొలగించాలని, లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి సబితారెడ్డి హామీతో విరమణ..
జర్నలిస్టుల ధర్నా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్లకు చేరుకొని జర్నలిస్టులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రిపోర్టర్లు ట్రైనీ ఎస్సై మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రొబేషనరీ పీరియడ్ కూడా పూర్తికాని ఎస్సైని ఎలా సస్పెండ్ చేస్తారని, తప్పకుండా డిపార్ట్మెంట్ తరపున యాక్షన్ ఉంటుందని చెప్పారు. అయినా వినకపోవడంతో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వచ్చి ఎస్సై మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.