జిల్లాలోని పలు పాఠశాలల్లో బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాధాకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. ఉట్టి కొడుతూ, పిల్లనగ్రోవి ఊదుతూ విద్యార్థులు సందడి చేశారు. ఆయా గ్రామాల్లోనూ తల్లిదండ్రులు తమ చిన్నారులను చిన్నికృష్ణుడు, గోపికలుగా అలంకరించి మురిసిపోయారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 6 : ఫరూఖ్‌నగర్ మండలంలోని కడియాలకుంట తండా అంగన్వాడీ కేంద్రంలో బుధవారం శ్రీకృ ష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చరిత్రను హెచ్ఎం అరుంధతి తల్లిదండ్రులు, గ్రామస్తులకు వివరించారు. శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సుజాత, వార్డుమెంబర్ బుజ్జి పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని పలు పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు గోపికలు, విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో ఎంతగానో అలరించారు. పిల్లనగోవితో ఆట, పాటలతో విద్యార్థులు ఎంతో సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కడ్తాల్ : కడ్తాల్ గ్రామంలో పలు పాఠశాలల్లో విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషధారణలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులచే ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజీవ్నాంపల్లి, వైస్ ప్రిన్సిపాల్ రంగారావు, కోఆర్డినేటర్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : కృష్ణాష్టమి వేడుకలను ఆమనగల్లు పట్టణంలో ముందస్తుగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణతో అలరించారు. వేడుకల్లో శ్రీనివాస్ రెడ్డి, వి.విఠల్, వాస శ్రీనివాస్, చుక్కఅల్లాజీ గౌడ్, సుజాత పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : శ్రీ కృష్ణాష్టమి వేడుకలను చేవెళ్లలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
తుర్కయాంజాల్ : మున్సిపాలిటీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను కృష్ణుడు, గోపికలుగా అలంకరించి మురిసిపోయారు.