షాద్‌నగర్, మే 18 : నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాల్సిన హోటళ్ల నిర్వాహకులు నాసిరకం, కల్తీ, పురుగులతో కూడిన ఆహారాన్ని వడ్డించడంతో వినియోగదారులు అనారోగ్యంపాలవుతున్నారు. షాద్‌నగర్‌లోని రాఘవేంద్ర హోటల్లో ఆదివారం టిఫిన్ చేసేందుకు వచ్చిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. తినేందుకు దోశను ఆర్డర్ ఇచ్చిన అతడు సగం దోశను తిన్న తరువాత దోశలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఆ వినియోగదారుడు వాంతులు చేసుకున్నాడు.
ఇలా తరచుగా సంఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే హోటల్లో పలుమార్లు ఆహార పదార్థాల్లో పురుగులు, ఈగలు, దోమలు, బొద్దింకలు దర్శనమిచ్చిన ఘటనలు ఉన్నాయని, ఆహార వడ్డింపు, తయారీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.