సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్లు పనికి రాకుండా పోతుండగా.. కొందరు అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. మూడేండ్ల పాటు టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలతో కొందరు అధికారులు మిలాఖత్ అయి.. రికార్డుల్లో నిర్వహణ భేష్ అంటూ బిల్లులు పెట్టేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం టాయిలెట్లకు తాళాలు వేయడం, కనీసం ఎం దుకు పనికి రాకుండా ఉంటున్నాయి. నిర్వహణను గాలికి వదిలేసిన కొందరు.. బిల్లులు మాత్రం పెట్టేస్తుండడం గమనార్హం.
ఆరు జోన్లలో 4,826 సీట్లలో 1,857 పబ్లిక్ టాయిలెట్లు ఉం డగా.. కూకట్పల్లి జోన్లో 403 టాయిలెట్లలో ఎక్కువ శా తం నిర్వహణ లేకుండా ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా లేకున్నా బిల్లులు డ్రా చేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. అధికారులు మాత్రం మార్చి నుంచి పేమెంట్లు జరగలేదని చెబుతున్నారు. వాస్తవంగా మూడేండ్ల పాటు ఏజెన్సీల నిర్వహణపై పర్యవేక్షణ చేసి అం దుకు అనుగుణంగా బిల్లులు చెల్లించే బాధ్యత జీహెచ్ఎంసీది. మూడేండ్ల టెండర్ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు వారితో పనిచేయించి బిల్లులు ఇవ్వాల్సిన చోట…ఈ ప్రక్రియలో నిర్వహణ లేని ఒక్కో టాయిలెట్‌కు రూ.3,960ల చొప్పున కాంటిజెంట్ బిల్లు పెడుతుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కూకట్పల్లి జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన టాయిలెట్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మురుగు కూపాలుగా, అధ్వాన స్థితిలో ఉన్నాయి. 2023 మార్చిలో కూకట్పల్లి జోన్ పరిధిలో 403 టాయిలెట్లకు టెండర్ వేశారు. టెండర్ వచ్చిన ఏజెన్సీలు మూడేండ్ల (2026) వరకు వాటి నిర్వహణ బాధ్యతను చేపట్టాలి. టెండర్లో ఐదు ఏజెన్సీలకు కాంట్రాక్ట్ దక్కింది. ఇం దులో ప్యాకేజీ-1 స్ట్రాటోస్, ప్యాకేజీ-2 ఎస్డీ ఫెసిలిటీ సర్వీస్, ప్యాకేజీ-3 గోపీ సురేంద్రకుమార్, ప్యాకేజీ-4 సఫాయి కర్మచారి కాంగార్ సొసైటీ, ప్యాకేజీ-5 శ్రీ దుర్గా భవాని ఎంటర్ ప్రైజేస్కు కేటాయించారు. టెండర్ సమయం లో జోనల్ కమిషనర్, సూపరింటెండెంట్ ఇంజినీర్, సీటీవో, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో టెండర్లను ఇచ్చారు. వీటి నిర్వహణ సరిగా అయిందా లేదా అనేది అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ పరిశీలించి రిపోర్టు పం పాలి. రిపోర్టులో అన్ని సరిగ్గా ఉంటేనే బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నిర్వహణలో లేని వాటికి సైతం బిల్లులు పెడుతున్నట్లు తెలిసింది. వివిధ పనుల కోసం
వచ్చే వారికి ‘అర్జెంట్’ అయితే ఎక్కడికి వెళ్లాలో అర్థం కానీ పరిస్థితి . తిరిగి పే అండ్ యూజ్ టాయిలెట్లకు వెళ్లక తప్పడం లేదు. ఆర్టీసీ బస్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, పార్కుల వద్ద ఏర్పాటు చేసిన టాయిలెట్లలో చాలావరకు ప్రస్తుతం కనిపించడం లేదు. వాస్తవానికి కమర్షియల్ ఏరియాల్లో ఉండే టాయిలెట్లను రోజుకు నాలుగు సార్లు, నాన్ కమర్షియల్ రోజుకు కనీసం మూడు సార్లు క్లీన్ చేయాల్సి ఉన్నది. డైలీ క్లీనింగ్ చేస్తున్నారా? అంటే లేదనే స్థానికులు చెబుతున్నారు. కొన్ని టాయిలెట్లకు కనీసం డోర్లు కూడా లేవని, వీటికి తోడు మరుగుదొడ్లలో నీళ్లు కూడా అందుబాటులో ఉండడం లేదని పేర్కొంటున్నారు. దీంతో విధిలేక చాలా మంది ‘పే అండ్ యూజ్’, బస్టాప్‌ల వద్ద ఉండే సులభ్ కాంప్లెక్స్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.