‘మిషన్ కాకతీయ’తో చెరువులకు మహర్దశ వచ్చింది. పూడిక తీత, పునర్నిర్మాణం, చెరువుల కట్టల పునరుద్ధరణలో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. బంట్వారం మండలంలోని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో రెండు పంటలకు డోకా లేదని అన్నదాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరినైట్లెంది.
బంట్వారం, జూలై 10 : పరాయి పాలనలో పంటలు పండాల్సిన పొలాల్లో పల్లేర్లు మొలిచినయి. సాగునీరు లేక భూములు బీడువారినయి. కాకతీయుల నుంచి నిజాం కాలం నాటికి గ్రామాల్లో గొలుసు కట్టు చెరువులు నిండుగా ఉండి రెండు పంటలకు సాగునీరందేది. రానురాను పాలకుల చిత్తశుద్ధి కరువై, రైతుల సంక్షేమాన్ని మరుగున పడేశారు. వలసపాలకుల నిర్లక్ష్యం కారణంగా చెరువులు పూడుకుపోయాయి. కలుపు మొక్కలు, చెత్తాచెదారంతో పేరుకు పోయాయి. దీంతో చెరువుల కింద ఆయకట్టు రైతులు జీవనోపాధి లేక పట్టణాలకు వలసలు పోయారు.
ఇక గ్రామాల్లోని కొందరు రైతులు వర్షాధారిత పంటలను నమ్ముకొని జీవించారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని సీఎం కేసీఆర్ సంకల్పిచారు. ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని అమలు చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. చెరువులు, కుంటలు, కాల్వల్లో పూడిక తీయడంతో పాటు మరమ్మతులు చేసి నీటి నిల్వ సామర్థ్యం పెరిగేలా చేశారు. బతుకుదెరువుకు వెళ్లే వలసలు ఆగాయి. మళ్లీ వ్యవసాయం పండుగలా మారింది. మండలంలోని కొల్లం చెరువు, సుల్తాన్పూర్ చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టారు. నేడు అవి జలకళతో దర్శనమిస్తున్నాయి. ఆయకట్టు పొలాలు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.
ఉమ్మడి బంట్వారం మండలంలో ‘మిషన్ కాకతీయ’ మొదటి దశలో ఐదు చెరువులను పునర్నిర్మించారు. మండల కేంద్రంలోని కొల్లం చెరువు కింద సుమారు 360 ఎకరాల ఆయకట్టు ఉండగా, గతంలో 50 ఎకరాలు మాత్రం సాగయ్యేదని రైతులు పేర్కొంటున్నారు. సరైన కాల్వలు లేవని, నీరు వృథాగా పోయేదని తెలుపుతున్నారు. తూము పాడై ఏండ్లు గడిచినా పట్టించుకున్న నాథుడే లేడంటున్నారు. తూము తలుపు (షట్టర్) మరమతు చేయక నీరు రాకపోయేదని రైతులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు మహర్దశ వచ్చిందని, ఆయకట్టు పొలాల్లో రెండు పంటలు పండుతున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పొలాలన్నీ పచ్చగా మారాయి..
చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు ఉన్నది. ఆయకట్టు పొలాలన్నీ పచ్చగా మారాయి. చెరువుల పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రెండు పంటలు పండుతున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే చుక్క నీరు ఉండకపోయేది. ఈ ఏడాది రెండు పంటలను పక్కగా తీస్తాం. చెరువులు నిండడంతో యాసంగి పంట వేసుకోవచ్చనే భరోసా వచ్చింది.
– ఎండీ ఖాజాపాష, రైతు బంధు సమితి బంట్వారం మండల అధ్యక్షుడు
కొల్లం చెరువుకు మహర్దశ
మండల కేంద్రంలోని కొల్లం చెరువుకు ‘మిషన్ కాకతీయ’తో మహర్దశ వచ్చింది. పూడిక తీత, కాల్వల నిర్మాణం, చెరువు కట్ట పునరుద్ధరణ వంటి పనులను చేపట్టారు. ఈ పనులకుగాను రూ.45.30 లక్షల నిధులను రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది. చెరువులో 10 వేల చదరపు మీటర్ల పూడిక తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. అదనపు నీళ్లు అలుగు నుంచి ప్రవహించేందుకు 630 చదరపు మీటర్ల ఆప్రాన్ నిర్మించారు. చెరువు కింద ఉన్న 360 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు 160 మీటర్ల సీసీ కాలువను నిర్మించారు. 650 మీటర్ల పొడవు ఉన్న చెరువు కట్టను 3 మీటర్ల ఎత్తుకు పెంచారు. చెరువు 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని తట్టుకొని ఉండేలా చెరువు కట్టను పునరుద్ధరించారు.
అన్నదాతలకు చేతినిండా పని..
గతంలో చెరువుల్లో నీళ్లు లేని చేతిలో పని లేక వలసలు పోయేది. రాష్ట్ర సర్కార్ చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. ప్రస్తుతం చెరువులు నిండడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఏడాదంతా చేతి నిండా పనే. రెండు పంటలకు సాగునీటికి డోకా లేదు. చెరువులు బాగుపడడంతో వ్యవసాయం మెరుగుపడడంతో పాటు మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది.
– ఆలంపల్లి శ్రీనివాస్, బంట్వారం