జిల్లాలో మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డిజిల్లా పరిధిలో ప్రభుత్వ భూములను మట్టి మాఫియా టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఉన్న కొండలు, గుట్టలను సైతం కొల్లగొట్టి మట్టిని చీకటి పడగానే టిప్పర్లు రోడ్డెక్కి నగరానికి తరలిస్తున్నాయి. జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల వంటి మండలాల నుంచి మట్టిని అక్రమంగా నగరానికి తరలించి విక్రయిస్తున్నారు. అక్రమ తరలింపు ద్వారా కోట్ల రూపాయలు గడిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లా మైనింగ్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– రంగారెడ్డి, జనవరి 8 (నమస్తే తెలంగాణ)
యాచారం మండలంలోని తక్కళ్లపల్లి, మంచాల మండలంలోని తిప్పాయిగూడ సమీపంలోని రాచకొండ గుట్టలు, కేశంపేట మండలంలోని సంగెం గ్రామం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఖానా సమీపంతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్ ప్రాంతాల్లో కూడా పెద్దపెద్ద కొండలను పిండి చేసి మట్టిని వెలికితీస్తున్నారు. ఈ మట్టి తరలింపు విషయంలో ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడక్కడ దాడులు చేస్తున్నా.. సెటిల్మెంట్లు చేసుకుని వదిలేస్తున్నారు. దీంతో మట్టి మాఫియా జిల్లాలో పెద్దఎత్తున రెచ్చిపోతున్నది.
జిల్లా పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ బోర్డు, భూదాన్ బోర్డు, ఆలయ భూముల్లో యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. రాత్రిపూట మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా మైనింగ్ అధికారులు కూడా అనుమతులిచ్చి చేతులు దులుపుకొంటున్నారని, అనుమతుల గడువు పూర్తయినప్పటికీ తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పాత తేదీల్లో తీసుకున్న అనుమతులతోనే కొందరు పనికానిచ్చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను పలువురు కోరుతున్నారు. రాత్రి 9 గంటలు దాటిందంటే వందలాది మట్టి టిప్పర్ల ద్వారా జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల, షాద్‌నగర్, మంచాల, యాచారం, ఆమనగల్లు, అబ్దుల్లాపూర్‌మెట్, కడ్తాల్, తుక్కుగూడ, బాలాపూర్, బడంగ్పేట్, ఆదిబట్ల వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున మట్టి అక్రమ తరలింపు సాగుతున్నది. ఇంత జరుగుతున్నా పోలీసులు, మైనింగ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలున్నాయి.