GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఆస్తులను అక్రమ లీజుదారులు దర్జాగా అనుభవిస్తున్నారు. ఏండ్ల తరబడి లీజు గడువు ము గిసినా.. వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నది. గజం స్థలానికి రూ.1 అద్దె చెల్లిస్తున్న లీజు ఒప్పందాలు నేటికీ యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆజాద్(మోతి) మార్కెట్ లీజుల గడువు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదే క్రమంలోనే తాజాగా లీజుదారులు సబ్ లీజులకు ఇచ్చి మరీ దందాలకు తెరలేపారు.
రూ.లక్షల్లో వసూలు చేసుకుంటూ జీహెచ్ఎంసీకి కేవలం రూ. వేలల్లో మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నట్లు గుర్తించా రు. ఇప్పటి వరకు 1750 మందికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. వాస్తవంగా లీజు పూర్తయ్యాక అధికారులు ఆయా దుకాణాలను ఖాళీ చేయించా లి. మళ్లీ టెండర్ వేలం వేసి కొనసాగించాలి. ఏడాదికొకసారి అద్దె విలువ 5% మేర పెంచాలి. కానీ ఘనత వహించిన ఎస్టేట్ విభాగం నోటీసులతోనే సరిపెడుతుండడం విమర్శలకు తావిస్తున్నది.
జీహెచ్ఎంసీ ఆస్తులను దశాబ్దాల కిందట అద్దెకు తీసుకొని గడువు ముగిసినా, వాటిని ఖాళీ చేయకుండా ఇతరులకు అప్పగించకుండా అడ్డుపడుతు న్న లీజుదారులు, వాటిని సబ్ లీజులకు ఇచ్చి లక్షల రూపాయలు అద్దెలు వసూలు చేసుకొని జీహెచ్ఎంసీకి కేవలం వేలల్లో మాత్రమే చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 22 మా ర్కెట్లుండగా, వాటిలో 2152 స్టాళ్లు ఉన్నాయి. వెజిటేబుల్ మార్కెట్లు 5, నాన్ వెజ్ మార్కెట్లు 7, రెండు కలిపి 10 కలిపి ఉన్నాయి. మున్సిపల్ కాంప్లెక్స్‌లు 19, యూనిట్లు 715 వరకు, మోడల్ మార్కెట్లు 37 ఉండగా 589 షాపులు ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాల నుంచి అద్దెలు చెల్లించని వ్యాపారులు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
గ్రేటర్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆస్తులకు సంబంధించిన రిజిస్టార్ ఏర్పాటు చేసి దాని ప్రకారంగా కంప్యూటరైజ్ చేశారు. ఆస్తులకు సంబంధించిన లీజు పూర్తయినా.. ఇంకా కొనసాగుతున్నట్లు వివరాలను సేకరించి వారందరికీ నోటీసులు జారీ చేసి వాటి వివరాలను అందులో పొందుపర్చారు. లీజుకు తీసుకున్న వ్యక్తి వినియోగించుకుంటున్నారా లేదా ఇతరులు ఉపయోగించుకుంటున్నారా అని క్షేత్ర స్థాయిలో జోనల్ అసిస్టెంట్ ఎస్టేట్ అధికారులు విచారించి ఈ నివేదిక సిద్ధం చేశారు.
రానున్న రోజుల్లో లీజు మార్కెట్ రేటు ప్రకారంగా కేటాయింపు జరగాలని, లీజు పూర్తయినా.. ఇంకా కొనసాగుతున్న దుకాణాల వివరాలపై పూర్తి నివేదిక అందజేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అద్దె చెల్లింపు కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లించడంతో పాటు ఒక్కొక్క ఆస్తికి ఒక్కో ఐడీని కేటాయిస్తున్నారు.