జిల్లాలోని పలు ఏరియా ఆస్పత్రులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎంహెచ్‌వో పరిధి నుంచి అప్‌గ్రేడ్ చేయగా.. వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకున్నారు. పడకల సామర్థ్యాన్ని కూడా 30 నుంచి 50కి పెంచారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ దవాఖానల్లో సరిపడా వైద్యు ల్లేక, పరికరాలు, వసతులు అందక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు నర్సులే చికిత్స అందిస్తుండడంతో ఆ వైద్యశాలలకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ)
అప్‌గ్రేడ్ అయిన ఆస్పత్రులు..
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, హయత్‌నగర్, యాచారం, శంషాబాద్‌లోని ఏరియా ఆస్పత్రులను గత ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్సెంటర్లుగా పేర్లు మా ర్చి వైద్యవిధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకున్నది. అయితే అప్‌గ్రేడ్ అయిన దవా ఖానల్లో గైనకాలజిస్టు, మత్తు, పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, రేడియాలజిస్టు, చెవి, ముక్కు, కంటి వైద్యులు, అవసరమైన థియేటర్లు, నర్సులను కేటాయించాల్సి ఉండగా.. వారిలో ఒక్కరినీ వైద్య విధాన పరిషత్ కేటాయించలేదు. అలాగే, సరైన మందులు కూడా పంపిణీ చేయకపోవడంతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గైనకాలజిస్టులు లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కాన్పుల కోసం వచ్చే వారు కూడా తగ్గిపోయారు.
శిథిలావస్థకు చేరిన భవనాలు..
జిల్లాలో అప్‌గ్రేడ్ అయిన ఆస్పత్రులు శిథిలావస్థకు చేరాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, ఆమనగల్లు, హయత్‌నగర్, శంషాబాద్ ఆస్పత్రుల భవనాలను గత 30 ఏండ్ల కిందట నిర్మించారు. ఈ దవాఖానల్లో సాగు నీటి సౌకర్యం లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆపరేషన్ థియేటర్లూ సరిగ్గా పనిచేయడం లే దు. దీంతో ఈ దవాఖానల్లో నూతన భవనాలను నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకు వాటి ఊసేలేదు. అలాగే ఈ ఆస్పత్రులను డీఎంహెచ్‌వో, వైద్య విధాన పరిషత్‌కు సంబంధించిన అధికారులెవరూ కన్నెత్తి చూడకపోవటంతో .. వైద్యులు, ఇతర సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో…ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. రోగులు మాత్రం గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డాక్టర్లు ఎప్పుడు వస్తున్నారో…ఎప్పుడు పోతున్నారో తెలియడంలేదు
అప్‌గ్రేడ్ అయిన ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో…ఎప్పుడు పోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. వైద్యంకోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో నర్సులే చికిత్స అందిస్తున్నారు. దీంతో చాలామంది రోగులు ఈ దవాఖానలకు వచ్చేందుకు జంకుతున్నారు.
-రవీందర్, యాచారం..
మెరుగైన వైద్యం అందించాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు దవాఖానల స్థాయిని పెంచడంతోపాటు నిధులు కూడా విడుదల చేసింది. అయితే ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో పేదలకు మెరుగైన వైద్యం అందడంలేదు. వైద్యులు, సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నర్సులే చికిత్స అందిస్తుండడంతో రోగులు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
-జెర్కోని రాజు, ఇబ్రహీంపట్నం