వికారాబాద్, ఆగస్టు 13 : భారీగా వన్య ప్రాణులు.. పెద్దసంఖ్యలో వృక్ష సంపద కలిగిన దామగుండాన్ని నాశనం చేస్తే సహించేది లేదని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ అన్నారు. సేవ్ దామగుండం -సేవ్ వికారాబాద్ అనే అంశంపై ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో చర్చా వేదిక జరిగింది.
ముఖ్యఅతిథులుగా జేఏసీ మాజీ జిల్లా చైర్మన్ కే శ్రీనివాస్, పూడూరు మండల మాజీ ఎంపీపీ మల్లేశం, బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, రవి బాబు, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ కన్వీనర్లు పాల్గొని మాట్లాడారు. అనంతగిరి కొండల్లోని సహజమైన అటవీ భూములను భారత నౌకాదళానికి రాడార్ స్టేషన్ కోసం కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందించారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్, వైజాగ్, ముంబై, జమ్మూ, భోపాల్ దేశవ్యాప్తంగా 13 ఇతర ప్రదేశాలతో సహా 18 నగరాల్లో ప్రదర్శనలు జరిగాయని గుర్తు చేశారు. ఇందులో అంచనా ప్రాజెక్ట్ వ్యయం రూ. 2,500 కోట్లు అని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి రాడార్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉన్నదన్నారు.
దశాబ్ద కాలంగా దామగుండం అటవీ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ, పర్యావరణ వేత్తలు ఈ ప్రాజెక్ట్ ప్రభావాల గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని వక్తలు వివరించారు. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలంలోని దామగుండం అడవులు జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయి. ఔషధ మొక్కలు, విలువైన వృక్ష, జంతుజాలంతో సహా వందలాది అరుదైన వృక్ష జాతులు ఉన్నాయని వారు వివరించారు.
ఈ ప్రాజెక్టు వల్ల 2,900 ఎకరాల అటవీ భూమిని క్లియర్ చేయడానికి దాదాపు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో యాంటెనా పార్క్ కోసం 1,400 ఎకరాలు, సాంకేతిక ప్రాంతాల కోసం 1,090 ఎకరాలు, అధికారిక నివాస సముదాయాల కోసం 310 ఎకరాలు ‘’సేఫ్ జోన్”గా 100 ఎకరాలు ఉన్నాయన్నారు. 20 గ్రామాల్లోని దాదాపు 60,000 మంది ప్రజలపై ఈ రాడార్ స్టేషన్ ప్రభావం పడుతున్నదన్నారు.
మూసీ, కాగ్నా వంటి స్థానిక నదులపై కూడా దీని దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా మతపరంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంపై ప్రభావం పడుతున్నదన్నారు. కలిసికట్టుగా దామగుండాన్ని రక్షించుకుందామని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘమిత్ర ఎన్ఏపీఎం మీరా, బీఆర్టీఎం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, శివరాజ్, రామన్న, శ్రీనివాస్ గౌడ్ ,వెంకటయ్య,వెంకటేశం, రుచిత, శ్రీనివాస్ ,జాకీర్, వెంకటేశం, మల్లేశం, నిఖిత, యాదయ్య, శ్రీకాంత్, రాములు తదితరులు పాల్గొన్నారు.