షాద్‌నగర్, జనవరి4ః గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించాలనే ఉద్దేశంతో ఫరూఖ్‌నగర్ మండలం చించోడు గ్రామంలో మద్య నిషేధంపై గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం గ్రామంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాల సూచనలు, సలహాలను సేకరించారు. గ్రామంలో మద్యాన్ని విక్రయిస్తే రూ. 50 వేల జరిమాన, మద్యం కొన్నవారికి రూ. 25 వేల ఫైన్ చెల్లించేలా నిబంధన విధించారు. ఎవరైనా మద్యం అమ్మినట్లు చూసి చెప్పినవారికి రూ. 10 వేల నగదు బహుమతి ఇస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి రూ. లక్ష జరిమానా విధించేలా తీర్మానం చేశామన్నారు.
ఎన్నికల సమయాల్లో గ్రామంలో మద్యం పంచేవారికి రూ. 5 లక్షల జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామంలో పేకాట ఆడినట్లు తెలిస్తే రూ. 50 వేల జరిమానా, పేకాట వివరాలను చెప్పినవారికి రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తామని నిర్ణయించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని, ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. సమావేశంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు.