పెద్దేముల్, జనవరి 30 : కులమతాలకతీతంగా జాతరలు, ఉర్సు జరుపుకోవడం చాలా సంతోషకరమని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి తట్టేపల్లి గ్రామంలో హజ్రత్ సులేమాన్ సాహెబ్ 62వ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొని దర్గాలో చాదర్‌ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ.. దర్గా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తట్టేపల్లి ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి.. ఇక్కడ నివసించే పేదల సమస్యలు పరిష్కరించడానికి ముందుంటామని పేర్కొన్నారు.
అభివృద్ధికి ఎవరు అడ్డువచ్చినా సహించేదిలేదన్నారు. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజా సేవ కోసం ముందు వరుసలో నిలబడుతామన్నారు. ఉర్సు ఉత్సవాల్లో జడ్పీటీసీ ధారాసింగ్ కూడా స్థానిక నాయకులు, దర్గా కమిటీ సభ్యులతో కలిసి దర్గాను సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాను అన్ని విధాలుగా అభివృద్ధిపరచడానికి తన వంతు కృషిచేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.