వికారాబాద్, ఆగస్టు 7 : రాష్ట్రంలో నిరుపేదలకు కంటి చూపును అందించాలనే సదుద్దేశంతో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులోభాగంగా గ్రామగ్రామాన శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు కండ్లద్దాలను అందజేశారు. అవసరమున్నవారికి శస్త్రచికిత్సలను సైతం చేశారు. మిగిలినవారికి కూడా కంటి అద్దాలను అందజేయాల్సి ఉండగా.. అవి వికారాబాద్‌లోని కొత్తగడి సమీపంలో చెత్తకుప్పలో పెద్దసంఖ్యలో పడవేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అద్దాలు అర్హులకందకుండా చెత్తలో పడవేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్ర అని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యారోగ్య శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాక్సులపై కేసీఆర్ ఫొటోలున్నాయని.. అందుకే అర్హులకందకుండా కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు కలిసి చేసిన పనే అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టి అద్దాలు అర్హులకు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగడి శివారుల్లో కేసీఆర్ ఫొటోలు ఉన్నందున పెద్దఎత్తున కంటి వెలుగు అద్దాల సెట్స్‌ను అధికారులు చెత్తలో పడవేశారు. దీంతో ప్రభుత్వ ధనానికి తీవ్ర నష్టం జరిగింది. వెంటనే వాటిని పేదలకు పంచాలి.. లేకపోతే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.
– శుభప్రద్‌పటేల్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు