నమస్తే తెలంగాణ,నెట్వర్క్ ;ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామ దహనం కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచే రంగుల కేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్‌ఫుల్ వేడుకల్లో మునిగితేలారు. రంగులన్నీ ఒక్కచోట కుప్పపోశారా..! అన్నట్లుగా చూపరులకు కనువిందు కలిగింది. స్నేహితులు, బంధువులతో కలిసి ఆడిపాడారు. రకరకాల రంగులను కలిపిన నీటిని చల్లుకుని హోలీ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. మహిళలు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని హోలీ ఆడి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పల్లెల్లో డప్పులు, డోలువాయిద్యాలతో ర్యాలీగా తిరుగుతూ హోలీ పాటలు పాడుతూ సందడి చేశారు. చిన్నారుల ఆనందానికి అవధుల్లేవు. బకెట్లు, మగ్గులు, సీసాలు, బొమ్మతుపాకీల్లో రంగునీళ్లు పోసుకొని పిచికారీ చేస్తూ కేరింతలు కొట్టారు. యువకులు రోడ్ల పైకి వచ్చి కోడిగుడ్లు, టమాటాలతో స్నేహితులకు కొట్టడంతో పాటు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. జిల్లాలో పలుచోట్ల ఉట్లు కొట్టడం కనిపించింది. డీజేలు పెట్టి డ్యాన్స్‌లు చేస్తూ ఆనందంగా గడిపారు.
జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లోని పట్టణాలు, గ్రామాల్లో మంగళవారం హోలీ పండుగ సంబురాలు చిన్నా, పెద్ద, తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకున్నారు. అదే విధంగా రంగులు చల్లి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల యువకులు డీజే, బ్యాండ్లను ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేశారు. అదే విధంగా ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రంగుల కేళీ అంబరాన్నంటింది. సోమవారం రాత్రి పలు చోట్ల కామదహనాన్ని నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే వీధివీధిన చిన్నాపెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. చిన్నారులు కేరింతలు కొడుతూ చిందులేశారు. కొన్నిచోట్ల సంప్రదాయబద్దంగా సహజ రంగులను ఉపయోగించారు. పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. యువత డీజేలు, బ్యాండ్లను ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేశారు. ఆడిపాడారు. కొన్ని చోట్ల హోలీ ఉత్సవంలో పాల్గొని పోటీపడుతూ ఉట్టిని పగులగొట్టారు. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హోళీ అన్ని రంగుల సమ్మేళనంతో కూడుకుందని, జీవితాలు కూడా ఆనందమయంగా ఉండాలని ఆకాంక్షించారు.