ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్‌లు కుట్టిచ్చిన మహి ళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కుట్టు కూలీ డబ్బులు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటివరకు ఒక్క జత యూనిఫామ్‌కు సంబంధించిన రూ.50 మాత్రమే సర్కారు చెల్లించింది. రెండో విడతకు సంబంధించి స్పష్టత లోపించింది. దాదాపుగా రూ.72.45 లక్షలు రావాల్సి ఉండగా వాటి కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులు డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వికారాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నది. పెట్టుబడి సాయం అందించకుండా రైతులను అప్పులపాలు చేసిన సర్కారు.. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్‌లు కుట్టిచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యు(ఎస్‌హెచ్‌జీ)లకు సైతం మొండిచేయి చూపుతున్నది. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ కుట్టిచ్చిన ఎస్‌హెచ్‌జీలకు నిధులిచ్చామని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నూతన ఇండస్ట్రీ పాలసీ కార్యక్రమంలో ప్రకటించారు. అయితే నాలుగు నెలలైనా ఇప్పటి వరకు వారికి పూర్తి మొత్తంలో నిధులు చెల్లించలేదన్నది వాస్తవం. బాధ్యతాయుత పదవిలో ఉన్న సీఎం అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. జిల్లాలోని 1042 ప్రభుత్వ పాఠశాలల్లోని 96,600 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌ను కుట్టించాలని.. ఇందుకు ఒక్కో జతకు రూ.75 చొ ప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీలకు తెలిపింది. అయితే యూనిఫామ్‌లు కుట్టిచ్చి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు కేవలం ఒక్క జత యూనిఫామ్‌కు రూ.50 మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.72.45 లక్షల కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులు డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా తాండూరు మండలంలో రెండో జత యూనిఫామ్ విద్యార్థులకు ఇంకా పంపిణీ చేయాల్సి ఉన్నది.
విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టిచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కుట్టు కూలీ చెల్లించడంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. మొదటి జత యూనిఫామ్‌కు సంబంధించి కేవలం రూ.50 అందజేసిన విద్యాశాఖ.. మిగతా రూ.25లపై చేతులెత్తేసింది. మిగిలిన డబ్బులూ విద్యాశాఖ ద్వారానే వస్తాయని డీఆర్డీఏ అధికారులు చెబుతుండగా, సెర్ప్ ద్వారా వస్తాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏ శాఖ నుంచి నిధులు వస్తాయో తెలియక ఎస్‌హెచ్‌జీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రెండు జతల యూనిఫామ్‌కు సంబంధించి ఎస్‌హెచ్‌జీలకు డబ్బులిచ్చామని చెప్పడం అబద్ధమని పలువురు పేర్కొంటున్నారు.
రెండో జత యూనిఫామ్ కుట్టిన డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆ నిధులను పెండింగ్‌లో పెట్టడం తగదు. వేల రూపాయలు పెట్టి కుట్టుయంత్రాలను కొనుగోలు చేసి డ్రెస్సులు కుట్టాం. సర్కారు డబ్బులు చెల్లిస్తే మా అప్పులు తీరుతాయి.
– వసీమా, మర్పల్లి
ప్రభుత్వం విద్యార్థుల యూనిఫామ్ జతకు రూ.150 చెల్లించాలి. కానీ, రెండు జతలకు కలిపి రూ.75 ఇస్తుండడంతో పెరిగిన ధరలకు గిట్టుబాటు కావడం లేదు. సర్కార్ మొదటి జత కుట్టిన డబ్బులు చెల్లించి.. రెండు జతవి చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదు.
– గౌరమ్మ పంచలింగాల్, మర్పల్లి
రెండో జత యూనిఫామ్‌కు సంబంధించి ఎస్‌హెచ్‌జీలకు కుట్టు కూలీ డబ్బులు ఇంకా ప్రభుత్వం నుంచి రాలేదు. ఒక్కో జతకు రూ.75 చొప్పున ఇవ్వాల్సి ఉన్నది. అయితే మొదటి జత యూనిఫామ్‌కు రూ.50 చొప్పున ఎస్‌హెచ్‌జీలకు డీఆర్డీఏ ద్వారా అందజేశాం. మిగతా రూ.25 సెర్ప్ ద్వారా అందిస్తాం. ఇప్పటివరకు జిల్లాలో 97 శాతం విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌ను అందజేశాం. ఒక్క తాండూరు మండలంలో మాత్రమే పెండింగ్ ఉంది త్వరలోనే పంపిణీ చేస్తాం.
– రేణుకాదేవి, డీఈవో వికారాబాద్
ప్రభుత్వం యూనిఫామ్ కుట్టేందుకు ఒక జతకు 75 రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది… కానీ మొదటి జతకు ప్రస్తుతం 50 రూపాయలు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఒక యూనిఫామ్‌కు 75 రూపాయలు చెల్లించాలి. యూనిఫామ్ కుట్టడానికి మా కష్టం చాలా ఉన్నది. అధికారులు స్పందించి పూర్తి డబ్బులు వచ్చేలా చూడాలి.
– లక్ష్మి, అంతారం, కులకచర్ల మండలం
విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనిని మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్ప గించడం ద్వారా ఉపాధి లభిస్తున్నది. కానీ ప్రభుత్వం ఇస్తున్న కూలీ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. బయట ఒక యూనిఫామ్ కుట్టాలంటే రూ.300 వరకు తీసుకుంటున్నారు. అన్ని ధరలూ పెరిగాయి. ప్రభుత్వం మాత్రం రెండు జతలకు కలిపి రూ.75 చెల్లిస్తున్నది.. ఆ మొత్తాన్ని పెంచితే బాగుంటుంది.
– కావలి చరిత, కుట్టు కేంద్రం నిర్వాహకురాలు, తుంకిమెట్ల
విద్యార్థుల యూనిఫామ్ కుట్టేందుకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.50 ఏ మాత్రం సరిపోవడం లేదు. పెంచిన కూలీ ప్రకారం జతకు రూ.75 ఇవ్వాలి. కాజాలు, గుం డీలు కుట్టిన వారికి ఇంకా డబ్బులు ఇవ్వాలి. పెంచిన కూలీ ఇస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
– గౌసియాబేగం, కొత్తూరు
కుట్టిన రెండు జతలకు ప్రభుత్వం డబ్బులు ఇయ్యలె. యూనిఫామ్ కుట్టిన వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పారు. కాని ఇప్పటివరకు డబ్బులు మంజూరు కాలేదు. అధికారులు మొదటి యూనిఫామ్‌కు డబ్బులు చెల్లించడంతో పాటు రెండో యూనిఫామ్‌కు కూడా డబ్బులు చెల్లించాలి.
– నీలమ్మ, బండవెల్కిచర్ల, కులకచర్ల మండలం