తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సుమారు రూ.2 కోట్లతో హెచ్ఎండీఏ మాసబ్ చెరువును సుందరీకరించి ఆకర్శణీయంగా తీర్చిదిద్దింది. ఉదయం పూట వాకింగ్‌కు వచ్చేవారికి సౌకర్యాలను కల్పించారు. కానీ చెరువులో నిత్యం వేస్తున్న వ్యర్థాలతో వాకింగ్‌కు వచ్చే వారి ముక్కులు పగిలిపోతున్నాయి.
సాగర్ ప్రధాన రహదారి నగరానికి చేరువగా ఉండటంతో నగరం నుంచి ఎంతో మంది చెరువు వద్ద గల పార్కుకు వస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు చెత్త, చెదారం యథేచ్చగా చెరువులో పారబోస్తున్నారు. చెరువును పూర్తిస్థాయిలో సుందరీకరించిన అధికారులు చెరువులో వ్యర్థాలను వేయకుండా అడ్డుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు.
సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చెరువు పూర్తి డంపింగ్ యార్డుగా మారకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చెరువు వద్ద సిబ్బందిని ఉంచి చెత్త, చెదారం వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.