నందిగామ, మార్చి 27 : గ్రామాల్లో మాజీ సర్పంచ్లు చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ..మాజీ సర్పంచ్ల అరెస్టు అక్రమని సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి అన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్లు గురువారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా నందిగామ మండలంలోని మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరిన మాజీ సర్పంచ్లను ప్రభుత్వం పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని మండిపడ్డారు. అరస్టైన వారిలో చేగూరు మాజీ పీఏసీఎస్ చైర్మన్ విఠల్, సర్పంచ్లు గోవిందు అశోక్, జట్ట కుమార్, నర్సింహ, బండి రాజు తదితరులు ఉన్నారు.