సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన బ్లాక్ చైన్ టెక్నాలజీతో విద్యార్థుల ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ‘ప్రశస్తి’ పేరుతో టీ హబ్‌లోని న్యూరల్బైట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి పాఠశాలలోని విద్యార్థులు వివిధ అంశాల్లో కనబర్చే ప్రతిభా అవార్డుల వివరాలను బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్లో పొందుపర్చేలా మొట్ట మొదటిసారిగా చేపట్టింది. టీ హబ్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో టీ హబ్ సీఈవో ఎం.ఎస్.రావు ప్రారంభించారు. కొత్తగూడలోని న్యూబ్లూమ్ హైస్కూల్ విద్యార్థులకు టీ హబ్‌లో ప్రశస్తి కార్యక్రమం ముఖ్యఉద్దేశాన్ని వివరించారు.
ప్రశస్తి వేదికగా విద్యార్థి దశలో వచ్చిన అవార్డుల వివరాలను ఇందులో పొందుపర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా సరే చూసుకునేందుకు వీలుగా వారి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని న్యూరల్బైట్ స్టార్టప్ వ్యవస్థాపకులు రవికుమార్ రాజు తెలిపారు. సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన వెబ్-3 బ్లాక్ చైన్ టెక్నాలజీతో వినూత్న ప్రాజెక్టులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు సంబంధించిన ప్రతిభాపాటవాలన్ని ప్రశస్తి వెబ్సైట్లో (https://prasasti.io/) పొందుపరుస్తున్నామని తెలిపారు.