చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో తమ వారిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు సెగ్మెంట్‌కు చెందిన 14 మంది రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో తాండూరు ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. యాలాల మండలంలో ఆరుగురు మృత్యువాత పడడంతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
-తాండూరు, నవంబర్ 4
15 రోజుల కిందట సందడి.. నేడు విషాదం..

మండలంలోని పేర్కంపల్లికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు బస్సు ప్రమాదంలో మృతి చెందడం తో వారి తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. తల్లి తల్లడిల్లుతూ నా పిల్లలు ఎక్కడ అం టూ రోదిస్తుండడంతో ప్రజల కన్నీళ్లు ఆగడం లేదు. ఎల్లయ్యగౌడ్ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు న్నా డు. 15 రోజుల కిందటే పెద్ద కుమార్తె వివాహం జరిగింది. మిగిలిన ముగ్గురు కుమార్తెలు హైదరాబాద్‌లో చదువుతున్నారు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతుండగా.. మూడో కు మార్తె సాయిప్రియ కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కుమార్తె ఆ కళాశాలలోనే డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నది. వీరు ముగ్గురు బంధువుల పెళ్లి కోసం తాండూరుకొచ్చారు. వివాహనంతరం సోమవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా బస్సు ప్రమాదంలో వారు మృతి చెందారు. దీంతో ఆ ముగ్గురి అంత్యక్రియలు స్వగ్రామం పేర్కంపల్లిలో నిర్వహించారు. జనం అధికంగా తరలిరాగా.. రోదనలతో ఊరంతా తల్లడిల్లింది.
అనాథలుగా మారిన బాలికలు..

తాండూరు సెగ్మెంట్లో మృతి చెందిన 14 మంది కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామన్నారు. ము ఖ్యంగా యాలాల మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన కుడుగుంట బందెప్ప, కుడుగుంట లక్ష్మి దంపతులు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఆ ఇద్దరు చిన్నారులు శిరీష (16), భవా ని(9)కి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. మరో వైపు చైల్డ్‌లైన్ వారు అనాథలుగా మారిన పిల్లలను కలిసి వివరాలు తీసుకున్నారు. వారికి తాము అండగా ఉంటామని, మంచి చదువులు చదివిస్తామన్నారు.
పుట్టింటి నుంచి మెట్టినింటికెళ్తూ..

తాండూరు పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన ఖాలీద్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆయ న కుమార్తె సలేహ (20)కి హైదరాబాద్‌కు చెందిన వాహిద్‌తో పెం డ్లి జరిగింది. కాన్పుకో సం తల్లిగారి ఊరైన తాండూరుకొచ్చి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఖాలీద్ తన కుమార్తె సలేహతోపాటు రెండు నెలల మనుమరాలును అత్తింటికి పంపేందుకు బస్సులో వెళ్తుండగా చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో పసిపాపతోపాటు తల్లీ మృతి చెందింది. చికిత్స పొందుతూ ఖాలీద్ కూడా మృతిచెందాడు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. అదేవిధంగా భర్త, పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వెళ్తున్న తాండూరు పట్టణానికి చెందిన తబస్సుమ్ కూడ మృతి చెందింది. భర్త, ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారు. కండ్లముందే తల్లి మృతి చెందడంతో ఆ పిల్లల రోదనలు మిన్నంటాయి.
తల్లిని చూసేందుకొచ్చి..
హైదరాబాద్‌లో నివాసముంటున్న నాగమణి తాండూరులో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు శుక్రవారం తాండూరుకొచ్చి.. సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబీకులు తీవ్ర బాధలో మునిగిపోయారు. గంటలో వస్తున్నా అంటూ కొడుక్కి చేసిన ఆ ఫోన్‌కాలే చివరిమాటైంది.
ఉన్నత చదువు కోసం వెళ్తూ..

తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుండడంతో ఆ విద్యార్థినులు సైతం హైదరాబాద్‌లోని కళాశాలల్లో చక్కగా చదువుతున్నారు. యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి, అలివేలు దంపతుల కుమార్తె అఖిలారెడ్డి(20) హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతున్న ది. ఆదివారం సెలవు కావడంతో అమ్మతెచ్చిన ఫోన్‌ను గిఫ్టుగా తీసుకొని సెలవు రోజు ఇంట్లో సరదాగా గడిపింది. సోమవారం తిరిగి కళాశాలకు వెళ్తున్న సమయంలో చేవెళ్ల వద్ద జరిగిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
మృతురాలి బాబాయ్ ఆర్‌వీరెడ్డి ప్రజాప్రతినిధుల తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కరన్‌కోట్‌కు చెందిన చాంద్‌పాషా కూతురు ముస్కాన్‌బేగం కోఠి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నది. శనివారం ఇంటికొచ్చిన ఆమె సోమవారం తిరిగి వెళ్తూ కుటుంబీకులకు సంతోషంగా టాటా చెప్పింది. హైదరాబాద్ వెళ్లి 8 గంటలకు ఫోన్ చేస్తానన్న కుమార్తె మృతి చెందిందని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతి చెందిన బిడ్డను చూసి తల్లడిల్లిపోయారు.