ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణంటూ వెళ్లిన అధికారులకు ఎదురు తిరిగిన లగచర్ల గ్రామస్తులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సోమవారం అర్ధరాత్రి కరెంట్ కట్ చేసి ఇండ్లల్లోకి చొరబడి దొరికినవారిని దొరికినట్టు అరెస్ట్ చేశారు. అధికారులపై జరిగిన దాడికి సంబంధం లేని అమాయకులు, మైనర్లను సైతం లాక్కెళ్లారు. భూములు లేనివారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోతున్నామన్న ఆవేదనను అధికారులకు వ్యక్తం చేద్దామని అనుకుంటే, అనుకోని సంఘటన జరిగిందని బాధితులు పేర్కొంటున్నారు. గత పది నెలలుగా భూములివ్వబోమని ఆందోళనను వ్యక్తం చేస్తూ పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా, రైతులను రెచ్చగొట్టేలా ప్రజాభిప్రాయ సేకరణంటూ సమావేశాలు నిర్వహించడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అరెస్ట్ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
– కొడంగల్, నవంబర్ 12
ఉలిక్కిపడ్డ గ్రామాలు..
లగచర్లలో జరిగిన ఘటన.. అర్ధరాత్రి పోలీసుల అరెస్టులతో మిగిలి ఫార్మా బాధిత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మంగళవారం లగచర్లతోపాటు హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో నిర్మానుష్య వాతావరణం నెలకొన్నది. పల్లెల్లోని వృద్ధులు, మహిళలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లల్లోనే ఉండిపోయారు. అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేసి అర్ధరాత్రి ఇండ్లల్లో చొరబడి అరెస్టులు చేయడం ఏమిటని, మహిళలపై విచక్షణారహితంగా వ్యవహరించడం దారుణమని ఆరోపిస్తున్నారు.
ఆవేదనే ఆవేశంగా..
భూములు పోతున్నాయన్న బాధతో గత పది నెలలుగా తిండి, నిద్ర లేదని ఫార్మా బాధిత రైతులు తెలిపారు. నిత్యం ఆవేదన, ఆందోళనతో కాలం గడుపుతున్నామన్నారు. రెక్కలుముక్కలు చేసుకుని భూములను కొనుగోలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి అంటూ మా భూములను లాక్కోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా ఏర్పాటుకు భూములిచ్చే ప్రసక్తే లేదని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా అభిప్రాయ సేకరణ అంటూ రావడంతో ఆవేదన కాస్త ఆవేశంగా మారిందని వాపోయారు. అధికారులపై దాడి చేయాలనే ఉద్దేశం లేదని, ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. లగచర్ల గ్రామంలో ఏ ఒక్కరిని పలకరించినా తమవారిని పోలీసులు లాక్కెళ్లారని కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఫార్మాకు భూములివ్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కోసం పేదల భూములు గుంజుకోవాలని చూడడం బాధాకరమని, సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులు తీరు వల్లే ఎదురు తిరగాల్సి వచ్చిందని ఫార్మా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను తీసుకోండి.., పట్టా భూములను అప్పనంగా తీసుకుంటామంటే ఎలా ఒప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కడుపు కాల్చుకొని.. రెక్కలుముక్కలు చేసుకుని కొన్న పొలాలను కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమని తెలుపుతున్నారు. ఏదిఏమైనా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
అర్ధరాత్రి అరెస్టులు దారుణం..
దాడుల సంఘటన మధ్యాహ్నం జరిగితే అప్పటి నుంచి అధికారులు ఎటువంటి చప్పుడు చేయకుండా అర్ధరాత్రి కరెంటు తీసి మరీ ఇండ్లల్లోకి చొరబడి అరెస్టులు చేయడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాల్లో చాలా వరకు మగవాళ్లు ఉపాధి కోసం కూలీ చేసుకునేందుకు నగరానికి వెళ్లారని, మహిళలు, చిన్నారులు, వృద్ధులు మాత్రమే ఇండ్లల్లో ఉన్నారని తెలిపారు. ఎవరో చేసిన పాపానికి అమాయకులు సైతం బలయ్యారని, ఫార్మాకు సంబంధించి భూములు లేనివారిని అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. రాత్రంతా భయం గుప్పిట్లో గడిపామని మహిళలు రోదిస్తున్నారు.
సీఎంకు పేదోళ్ల భూములే కావాలా..
కంపెనీలు పెట్టాలంటే భూస్వాములు భూములో, సర్కారు భూములో తీసుకోవాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి మా పేదోళ్ల భూములే కావాలా..? మాకున్నదే ఎకరం పొలం.. దాన్ని సాగు చేస్తూ.. కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నం. మాకున్న ఆధారాన్ని లాక్కెళితే మేమెట్ల బతకాలె. ఏం తినాలె. మొగొళ్లు బతుకుదెరువుకని పట్టణాలకు పోయిండ్రు. తండాలో ఆడోళ్లం, పిల్లలమే ఉన్నం. అర్ధరాత్రి ఇంట్లో చొరబడి దాడి చేయడం న్యాయం కాదు.
– చాందిబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం
కదిలిస్తే.. కన్నీరే..
లగచర్ల గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరవుతున్నారు…ముక్కోటి దేవుళ్లకు మొక్కితే లేక లేక కొడుకు పుట్టాడని.. మొదటి పుట్టిన రోజు జరుపుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకొని బంధు మిత్రులను పిల్చుకుంటే.. గొడవకు సంబంధం లేని తన భర్తను అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారని కన్నీరుమున్నీరైంది లగచెర్ల వాసి భాత్యశ్రీ…మాకు భూములు లేవని, గొడవతో సంబంధమే లేదని మొత్తుకున్నా పోలీసులు వినలేదని విలపించింది..కూతురు అన్న ప్రాసన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటే తన భర్త నరేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని అద్విక కన్నీరు పెట్టుకుంది. తమకు ఈ గ్రామంలో భూములే లేవని, గొడవ జరిగే సమయంలో తన భర్త అసలు ఈ ఊరిలోనే లేడని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని ఆమె గుక్కపట్టి ఏడుస్తున్నది. ఉపాధికోసం ముంబై పోయామని, సంవత్సరానికి ఒకసారే ఊరికి వస్తామని, తన కొడుకు ఆరోగ్యం బాలేక సొంత గ్రామానికి వస్తే కరెంటు బంద్ చేసి పోలీసులు తీసుకుపోయారని మున్నిబాయి మొర పెట్టుకుంది.. ఫార్మా బాధిత గ్రామాల్లో ఇలాంటివి ఎన్నో బాధలు.. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి తమకు కన్నీరే మిగిలిందని చిన్నాపెద్దా తేడా లేకుండా కన్నీటి పర్యంతమవుతన్నారు.