బంట్వారం, ఏప్రిల్ 21 : కోట్పల్లి, బంట్వారం మండలాల్లో విద్యుత్ శాఖ అధికారులు వింత పోకడలకు పోతున్నారు. వానకాలంలో చెట్లతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదని చాలాచోట్ల చెట్లనే నరికివేస్తున్నారు. అయితే విద్యుత్ సరఫరాకు ఆటంకమైన చెట్ల కొమ్మలను నరకాల్సి ఉండగా.. ఏకంగా చెట్ల మొదళ్లనే నరుకుతుండడంతో పెద్ద పెద్ద చెట్లు నేలమట్టం అవుతున్నాయి. తిరిగి అవి పెరిగే అవకాశం లేకుండా పోతున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భా గంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి రాకపోకలు సాగించే వారికి నీడను ఇస్తున్నాయి. ప్రధానంగా కోట్పల్లి-సదాశివపేట రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, బం ట్వారం మండలంలోని తొరుమామిడి-బంట్వా రం రోడ్డులో ఉన్న చెట్లను మొదళ్లతో సహా మొ త్తం నరికేశారు. అంతేకాకుండా ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న చెట్లనుకూడా నేలమట్టం చేశారు. దీంతో స్థానిక మాజీ సర్పంచ్లు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
హరితహారంలో మొక్కలు నాటేందుకు ఎంతో కష్టపడ్డామని.. ఇప్పుడు ఏపుగా పెరిగిన మొక్కలను మొదళ్లతో సహా ఎందుకు నరుకుతారని ప్రశ్నిస్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటాలని అధికారులు చెప్పుతారు.. ఇప్పుడేమో విద్యుత్ శాఖ అధికారులు చెట్లను నరికి వేస్తారా.? ఇదేక్కడి విడ్డూరమంటూ మాజీ సర్పంచ్లు నర్సింహారెడ్డి, ఎల్లయ్యఅధికారులను ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయమైతే చెట్టుపై ఉన్న కొమ్మలనే తొలగించాల్సి ఉండగా చెట్ల మొదళ్లను తొలగిస్తే అవి మొత్తం చనిపోతాయని పేర్కొన్నారు.
ఏ చట్లైనా నరకాల్సిందే..
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ఉండాలంటే చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అన్ని చెట్లను నరకాల్సిందే. కొమ్మలను కాకుండా చెట్లను నరుకుతున్నాం. గాలి దుమారానికి చెట్లు విద్యుత్ వైర్లపై పడి ఏకంగా స్తంభాలే నేలపై పడిపోతున్నాయి. దీంతో చాలా గ్రామాలకు సరఫరా నిలిచిపోతున్నది. అందుకే ఏకంగా చెట్ల మొదళ్లకే నరకమని సిబ్బందికి చెప్పాం.
-రంగారెడ్డి ఏఈ, విద్యుత్ శాఖ, బంట్వారం