రంగారెడ్డి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లేందుకు ఓటర్లు క్యూ కట్టడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
మంత్రి సబితా ఇందారెడ్డితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్లతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు. కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ హోలీకేరీ పర్యవేక్షించారు. ఎన్నికలు సజావుగా ముగిసినట్లు అధికార యంత్రాంగం పేర్కొన్నది.
జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఓటింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరడం కనిపించింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఓటర్లు పెద్ద ఎత్తును తరలిరావడంతో కేంద్రాలు కిటకిటలాడాయి. పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా ఓటర్లు పెద్ద సంఖ్య క్యూ లైన్లలో కనిపించారు. దివ్యాంగులు, మహిళల కోసం ప్రతి నియోజకవర్గంలోనూ మాడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీటి వసతి, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.
జిల్లా వ్యాప్తంగా 3,453 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎన్నికల విధుల్లో మైక్రోఅబ్జర్వర్లు 283 మంది, పీవోలు 3,803 మంది, ఏపీవోలు 3,803, ఓపీవోలు 7,606లు కలుపుకుని మొత్తం 15,212 మంది విధులు నిర్వర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఓటింగ్ సరళిని కలెక్టర్ హోలీకేరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తన స్వగ్రామం అయిన చేవెళ్ల నియోజకవర్గంలోని కౌకుంట్లలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన సొంతూరు ఎలిమినేడులో, చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య నవాబుపేట మండలంలోని చించల్‌పేట్‌లో, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్ తన సొంతూరు అయిన కడ్తాల్ మండలంలోని చల్లంపల్లిలో, షాద్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ తన స్వగ్రామం ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, టీటీడీ డైరెక్టర్ సీతారెడ్డి మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ క్యామ మల్లేష్ శేరిగూడలో ఓటు వేశారు. కలెక్టర్ హోలీకేరి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ షాద్‌నగర్ పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు బిత్తిరి సత్తి చేవెళ్ల నియోజకవర్గంలోని పామెన గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.