సిటీబ్యూరో/యూసుఫ్‌గూడ, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో వేలాదిగా ఉన్న బోగస్ ఓట్లపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నది. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దొంగ ఓట్ల వివరాల సేకరణలో ఎన్నికల కమిషన్ అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్టుకు నివేదిక ఇవ్వాలనే ఉద్దేశమే తప్ప.. బోగస్ ఓట్లను గుర్తించడంపై దృష్టి పెట్టడంలేదనే ఆరోపణలున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇండ్లు మారి న, చనిపోయిన వారి వివరాల సేకరణ మాత్రమే చేపడుతూ.. బోగస్ ఓట్ల గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ ఇండ్ల చిరునామాలతో దొంగ ఓట్లు జాబితాలోకి ఎలా వచ్చాయని యజమాను లు ప్రశ్నిస్తే.. సమాధానం దాటవేస్తున్నట్లు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలోని కొన్ని డివిజన్లలో బోగస్ ఓట్లు నమోదైన ఇండ్లలోకి గుట్టుచప్పుడు కాకుండా వెళ్తూ వివరాలు సేకరిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు వస్తున్నారని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి సిబ్బంది వెళ్లిపోతున్నారని సమాచారం.
ఓటు నమోదు చేసుకున్న ప్రాంతం నుంచి మరో చోటుకు షిప్ట్ అయిన వారి వివరాలు, చనిపోయినా ఇంకా జాబితాలో పేర్లున్న వారి వివరాలను సేకరించేందుకు ఏఈఆర్వోలు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరికీ రెండు, మూడు ఓట్లుండడం, ఒకే చిరునామాతో ఎక్కువ ఓట్లున్న వారిని కూడా గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఏఈఆర్వోలు, బీఎల్వోలు ఆ దిశగా దృష్టిపెట్టడం లేదనే విమర్శలున్నా యి. నియోజకవర్గంలో వేలాది బోగస్ ఓట్లు న్నా.. చిరునామా మార్పు, చనిపోయిన వారి గురించే ఆరా తీస్తున్నారని సంబంధిత ఇంటి యజమానులు చెప్తున్నారు. ఒకే చిరునామా తో 40కి పైగా ఓట్లున్న ఇండ్లలోనూ చనిపోయిన, ఇండ్లు మారిన వారినే గుర్తిస్తున్నారని, వారి గురించే తమను అడుగుతున్నారని యజమానులు అంటున్నారు. అధికారులు నియోజకవర్గం వ్యాప్తంగా ఇలా నే తనిఖీలు చేస్తే బోగస్ ఓట్లను గుర్తించడం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. బోగస్ ఓట్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతున్నారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తించాలని హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టుకు నివేదిక ఇవ్వాలనే లక్ష్యంతోనే నామ మాత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే బోగస్ ఓట్లపై దృష్టిపెట్టకుండా చనిపోయిన వారు, ఇండ్లు మారిన వారిపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. బోగస్ ఓట్లను గుర్తిస్తే ఎన్నికల కమిషన్‌దే తప్పని కోర్టు భావిస్తుందని ఇలా చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ ప్రజలు, బోగస్ ఓట్లున్న ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా నిజాయతీగా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు.
తమ చిరునామా పేరిట 30, 40 మందికి ఓట్లున్నట్లు జాబితాలో ఎలా నమోదైందని ప్రశ్నిస్తే ఎన్నికల అధికారులు సమాధానం దాటవేస్తున్నారని యజమానులు చెప్తున్నా రు. బోరబండలోని బంజారానగర్ కవిత పబ్లిక్ స్కూల్ లేన్‌లో ప్రతి ఇంటిలోనూ బోగస్ ఓట్లున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నా రు. ఆ ప్రాంతంలోని సదాశివచారి అనే వ్యక్తి ఇంటికి ఎన్నికల సిబ్బంది వెళ్లి ఆ చిరునామాతో 42 ఓట్లున్నట్లు చెప్పారు. తమ ఇంట్లో ఏడుగురమే ఉంటే అన్ని ఓట్లు జాబితాలో ఎలా నమోదయ్యాయని సదాశివచారి ప్రశ్నించగా ఎన్నికల సిబ్బంది సమాధానం దాటవేశారని చెప్తున్నారు. ఏమీ చెప్పనప్పుడు తమ ఇంటికి ఎందుకొచ్చారని ప్రశ్నించగా అలాంటి విషయాలు అడగొద్దని.. చెప్తే తమ ఉద్యోగం పోతుందని అక్కడి నుంచి వెళ్లినట్లు సదాశివచారి అన్నారు. బోగస్ ఓట్లున్న ప్రతి ఇంటి యజమానికి ఇదే సంఘంటన ఎదురవుతున్నట్లు పేర్కొంటున్నారు. ఎన్నికల సంఘం అధికారికంగా తనిఖీ చేస్తున్నప్పుడు సమాధానాలు చెప్పుకుండా వెళ్లాల్సిన అవసరం ఏముందని నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బోగస్ ఓట్లున్నట్లు బయటకు వస్తే తమదే తప్పవుతుందేనే ఉద్దేశంతోనే గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.