షాబాద్, జూన్ 16: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు (Drinking Water) తప్పడం లేదు. గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా గత నాలుగు రోజులుగా నిలిచిపోయింది. దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఉన్న రెండు బోర్లు కాలిపోవడం, దీనికితోడు మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటి కోసం బిందెలు పట్టుకొని ప్రజలు ట్యాంకర్ల వద్దకు పరిగెత్తుతున్నారు.
ఒక ఇంటికి రెండు బిందెలు చొప్పున నీటిని అందిస్తుండటంతో తమకు నీరు సరిపోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ హయంలో ఏనాడూ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడలేదని, కాంగ్రెస్ పాలనలో తాగునీటి బాధలు తప్పడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్రామానికి మంచినీటీ సరఫరాను పునరుద్ధరించడంతోపాటు బోర్లను మరమ్మత్తు చేయించి తాగునీటి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.