సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ట్రై పోలీస్ కమిషనరేట్లలో సరైన ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండీఏ అధికారులతో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, భారీ వర్షాల సమస్యలు, బెటర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా విభాగాల అధికారులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని నగర సీపీ సీవీ ఆనంద్ తీసుకోవాల్సిన అంశాలపై ఈ సందర్భంగా వివరించారు. భారీ వర్షాలు వచ్చినప్పుడు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, రోడ్లు, క్రిటికల్ జంక్షన్ల వద్ద ఏర్పడే సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడంలో అన్ని శాఖలు పనిచేయాలని తెలిపారు.
ఇందులో సరైన ట్రాఫిక్ మళ్లింపులు, వాతావరణ విశ్లేషణలు, నోటిఫికేషన్లు, సైనేజ్ బోర్డులు, ఇంజినీరింగ్ విభాగం నుంచి అవసరమైన మార్పులు, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వేగంగా నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు.
ఆయా విభాగాల అధికారులతో సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించడం, ట్రై పోలీస్ కమిషనర్ల ట్రాఫిక్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులతో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఐటీ కంపెనీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు సుధీర్‌బాబు, అవినాష్ మహంతి, అధికారులు పాల్గొన్నారు.