వికారాబాద్, ఫిబ్రవరి 28 : వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ శనివారం సాయంత్రం 6 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో తొలి సంతకం చేసి అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజేశ్వరి, ఏసీఎల్బీ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా, సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకత, విద్యా, వైద్యం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతమైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతమైన అమలు, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాల్లో సమగ్రంగా ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. శాఖలవారీగా, మండలావారీగా రివ్యూ చేస్తానని, మీరు చేపట్టే పనులు అభివృద్ధి ఫొటోలు, పూర్తి వివరాలతో నోట్ సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో మంగీలాల్, ఆర్డీవో వాసుచంద్ర, కడా అధికారి వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.