తెలంగాణ ప్రభుత్వం 2022లో ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసింది. ఇటీవల ఎస్ఐ పరీక్షల ఫలితాలు కూడా వెలువడ్డాయి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు తమ ప్రతిభను చూపి విజయం సాధించారు. ఇందులో పేద, వ్యవసాయ కుటుంబాల అభ్యర్థులే అధికంగా ఉన్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకూ బంధువులు, స్నేహితులు వచ్చి అభినందనలు తెలుపుతుండడంతో పల్లెల్లో కొలువుల పండుగ వాతావరణం నెలకొన్నది.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తున్నది. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వేస్తున్నది. 2022లో ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసింది. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఇటీవల వెలువడ్డాయి. ఇందులో ఉత్తీర్ణులైనవారు వ్యవసాయ ఆధారిత కుటుంబీకులతో పాటు పేదలు ఉన్నారు. కొందరు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నత పదవిని అందుకున్నారు. మారుమూల పల్లెల్లో ఉంటూ ఉద్యోగాలు సాధించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. వారి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అభినందలతో ముంచెత్తారు. ఎస్ఐ ఫలితాలు వెలువడడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఎస్ఐ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రజా ప్రతినిధులతో పాటు, స్నేహితులు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎస్ఐ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు తాము పడ్డ కష్టాన్ని అభ్యర్థులు వెల్లడించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
2020లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం కరన్‌కోట్ పోలీస్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నా. తండ్రి కోరిక మేరకు ఎస్ఐ జాబ్ కోసం కష్టపడ్డాను. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షలకు హాజరయ్యాను. ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించినందుకు ఆనందంలో మునిగిపోయాను. కష్టపడి చదివించిన తల్లిదండ్రులు స్వరూప, నర్సింహారెడ్డిలకు రుణపడి ఉంటా.
– పెరుమాల్ల లక్ష్మీకాంత్‌రెడ్డి, బార్వాద్ గ్రామం (కోట్‌పల్లి)
ఆర్మీలో రిటైర్ అయ్యి.. ఎస్ఐ జాబ్‌కు సెలెక్ట్ అయ్యాను. 18 ఏండ్ల వయస్సులో ఆర్మీకి ఎంపికయ్యాను. 17 ఏండ్లు దేశ సేవ చేశాను. సియాచిన గ్లేసియర్‌లోని కఠిన వాతావరణంలో రెండేండ్లు విధులను నిర్వహించా. ఇజ్రాయిల్‌లోని లెబనాన్ దేశ బార్డర్లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 9 నెలలు సేవలను అందించి, 15 నెలల కింద ఆర్మీజాబ్ నుంచి రిటైర్మెంట్ పొందాను. ఉత్తమ సేవలను అందించినందుకు ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందాను. సైనిక మిత్ర బృందంతో కలిసి ఉన్న ఆనాటి రోజులను తలచుకుంటే సంతోషానిస్తున్నది. తల్లిదండ్రులు భీంరెడ్డి, భారతమ్మ. అక్కతో పాటు నేను ఇద్దరు సంతానం. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలో తండ్రికి సాయం చేస్తూ కష్టపడి చదివాను. ఇంటర్ మొదటి సంవత్సరంలోనే ఆర్మీలో జాబ్ వచ్చింది. ఆర్మీలో ఉంటూనే ఇంటర్, డిగ్రీతో పాటు బీ ఎడ్ పూర్తి చేశాను. ఎస్ఐ జాబ్ కోసం సంవత్సరం పాటు హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నా. ఎస్ఐ జాబ్‌తో పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్ కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో జరిగిన గ్రూప్-4లో కూడా జాబ్ వస్తుందన్న నమ్మకం ఉన్నది. దేశ సేవ చేసిన నాకు మళ్లీ ఎస్ఐ జాబ్ రావడం ఆనందంగా ఉన్నది. ఈ నెలలో ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళ్తున్నా. నాకు వివాహం అయ్యింది. ఇద్దరి కూతుర్లు ఉన్నారు.
– మహేందర్‌రెడ్డి, టేకల్‌కోడ్ గ్రామం, (కొడంగల్)
మాది వ్యవసాయ కుటుంబం. తల్లి సత్యమ్మ, తండ్రి మల్లికార్జున్‌లకు చిన్న కొడుకును. అన్న శ్రీశైలం తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు కొడంగల్ పట్టణంలోని శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాలలో చదివాను. కోస్గి పట్టణంలో ఇంటర్ పూర్తి, వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. రెండేండ్ల కింద డిగ్రీ పూర్తయ్యింది. ఎస్ఐ జాబ్ సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉండేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ తీసుకోలేకపోయాను. ఇంటి దగ్గరే పరీక్షకు సిద్ధమయ్యాను. ఎస్ఐ జాబ్ పరీక్షలో ఉత్తీర్ణుడిని అయినందుకు సంతోషంగా ఉన్నది. గ్రామ పెద్దలు అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నది.
– అశోక్, పాతకొడంగల్ గ్రామం (కొడంగల్)
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కల ఉండేది.. ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్‌కు ప్రయత్నం చేసినా రాలేదు. దీంతో బీకాం కంప్యూటర్ చదివాను. ముందు నుంచి ప్రజలతో మమేకమై ఉండటం చాలా ఇష్టం. పోలీస్ వృత్తిలోనే ప్రజాసేవ చేయవచ్చని జాబ్ సాధించాలని పట్టుదలగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం 2021లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు వేస్తే.. దాంట్లో విజయం సాధించాను. అప్పటి నుంచి విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగం సాధించాలని కష్టపడ్డాను. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో ఎస్ఐ (సివిల్) గా సెలక్ట్ కావడం సంతోషంగా ఉన్నది. ఎస్ఐ కావాలని మా నాన్న ఎక్కువగా ప్రోత్సహించేవారు. తండ్రి కోరిక తీరినందుకు ఆనందంగా ఉన్నది.
-ఎం.శశివర్ధన్‌రెడ్డి, వీర్లపల్లి (మర్పల్లి)
మాది పేద కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేది. 2018లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. పరీక్ష రాసి ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ సాధించాను. ప్రస్తుతం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నా. రాష్ట్ర పభుత్వం 2022లో వేసిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో చదివాను. తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌లో ఎస్ఐగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉన్నది.
– మునగాల రాజేందర్‌రెడ్డి, బూచన్‌పల్లి, (మర్పల్లి)
కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు. మాది పేద కుటుంబం. తల్లిదండ్రులు సోనిబాయి, లక్ష్మణ్ రాథోడ్‌లకు నాలుగో సంతానం. ముగ్గురు అన్నలు ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి చదివించారు. తాండూరులో డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్‌లో ఎంబీఏ చదివాను. 2018లో ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ సెలక్షన్లో ఎంపికయ్యాను. శంషాబాద్ పోలీస్‌స్టేసన్‌లో విధులు నిర్వహిస్తూ ఎస్ఐ ఉద్యోగానికి పరీక్ష రాశాను. ఆదివారం వెలువడిన చేసిన ఫలితాల్లో ఎస్ఐగా ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషంగా ఉన్నది.
– మంజుల రాథోడ్, జీవన్గి గ్రామం(బషీరాబాద్)
మాది నిరుపేద కుటుంబం. కష్టాలు పోవాలంటే చదువు ఒక్కటే మార్గమనుకున్నా. పట్టుదలగా చదివాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎటువంటి కోచింగ్‌లకు వెళ్లలేదు. మా తండ్రి సత్యనారాయణ కష్టపడి చదివించారు. పోలీసు శాఖ నిర్వహించిన ఎస్ఐ పరీక్ష రాశాను. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఐగా ఎంపిక కావడం సంతోషంగా ఉన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉన్నది.
– ఆనపోసల గాయత్రి, చౌలపల్లి పరిధిలోని మీనమోనిపల్లి(కేశంపేట)
ఎస్ఐ ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉన్నది. మా తల్లిదండ్రులు మర్పల్లి సంగయ్య, అనసూయలకు ఇద్దరు ఆడపిల్లలం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అక్క స్రవంతి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నది. నేను ఎంబీఏ పూర్తి చేశాను. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయడంతో దరఖాస్తు చేసుకుని ఎలాంటి కోచింగ్ లేకుండా కష్టపడ్డాను. ఎస్ఐ ఉద్యోగం సాధించినందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.
– మర్పల్లి మీనాక్షి, అమ్రాదికుర్దు (మోమిన్‌పేట)
పట్టుదల ఉంటే ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చు. 2018లో పోలీస్ ఉద్యోగానికి పరీక్ష రాసి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. డీఎస్సీ రాసి టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని మేడిపల్లి కలాన్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలగా ఉండేది. ఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణుడిని అయినందుకు సంతోషంగా ఉన్నది. సివిల్ ఎస్ఐగా ఎంపిక కావడానికి సహకరించిన అమ్మానాన్నలకు రుణపడి ఉంటాను.
– కడిచర్ల రఘురాంరెడ్డి, అంతారం గ్రామం (ధారూరు)
కష్టపడి చదివి అనుకున్న ఉద్యోగాన్ని సాధించాను. మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రుల కష్టాలను చూసి బాధపడేవాడిని. 2018లో పోలీస్ కానిస్టేబుల్ నోటిపికేషన్లో పరీక్ష రాసి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాను. 2022లో వేసిన ఎస్ఐ నోటిపికేషన్ వచ్చిన తర్వాత పట్టుదలగా చదివినందుకు ఫలితం దక్కింది. సివిల్ ఎస్ఐగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉన్నది. చదివించిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.
– బక్కనోళ్ల శివకుమార్‌రెడ్డి, కొండాపూర్‌ఖుర్దు, కేరెళ్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం, (ధారూరు)
మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు కాశీపురం యాదగిరి, భానమ్మలకు ముగ్గురు కుమారులం. నేను పెద్ద కుమారుడిని. వికారాబాద్‌లోని ప్రభుత్వ ఎస్ఏపీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. పోలీసు ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఉండేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదువుకున్నా. ప్రభుత్వ టీచర్ అయిన మా పెద్దనాన్న కొడుకు సలహాలు, సూచనలు చేసేవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, సంగారెడ్డికి చెందిన ఒకరితో కలిసి ఒకే గదిలో ఉంటూ ప్రిపేర్ అయ్యాం. ఆదివారం వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో ఉత్తీర్ణుడిని అయినందుకు సంతోషంగా ఉన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన అభినందనలను మరిచిపోను. ఎస్ఐ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కాశీపురం రామకృష్ణ, యెల్లకొండ గ్రామం(నవాబుపేట)
సివిల్ ఎస్ఐ ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉన్నది. ఏడాది పాటు కష్టపడి చదువుకున్నా. అదే స్థాయిలో ఈవెంట్లు, ఫిజికల్ టెస్టులకు ప్రిపేరయ్యాను. పట్టుదలతో చదివి పరీక్షలు రాశాను. సెలెక్షన్ కావడం చాలా ఆనందంగా ఉన్నది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవ కోసం శ్రమిస్తా.
– చైతన్య కిరణ్, రొంపల్లి గ్రామం(బంట్వారం)
ప్రభుత్వం 2018లో వేసిన నోటిఫికేషన్ సమయంలోనే నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా కొద్ది పాటిలో తప్పిపోయింది. ఆ కసితోనే తిరిగి ఈసారి బాగా కష్టపడ్డాను. అందుకు తగ్గట్టుగా చదివి పరీక్షలు రాశాను. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఏఆర్ ఎస్ఐగా ఉత్తీర్ణుడిని కావడం ఆనందంగా ఉన్నది.
– కె.లక్ష్మణ్, రొంపల్లి గ్రామం(బంట్వారం)
మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. పంట బాగా పండితేనే మా బతుకులు బాగుండేవి. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాం. 2019లో డిగ్రీ పూర్తి చేసి, ఎంఎస్సీ చదివాను. ఎస్ఐ ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడ్డాను. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణుడిని అయినందుకు సంతోషంగా ఉన్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందిస్తుండడం ఆనందంగా ఉన్నది. నోటిఫికేషన్ వేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అగ్గనూరు సురేశ్, బంట్వారం మండల కేంద్రం
పట్టుదలతో చదివి అనుకున్న ఉద్యోగాన్ని సాధించాను. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసి బాధపడేవాడిని. మాది వ్యవపాయ కుటుంబం. 2018లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాను. 2022లో వేసిన ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివినందుకు ఫలితం దక్కింది. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక నెరవేరింది.
– విస్లావత్ తుకారాం, డీకే తండా (ధారూరు)
మాది పల్లెటూరు. తల్లిదండ్రులు వెంకట్‌రెడ్డి, కవితలకు నాతోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నేను డిగ్రీలో ఎంఎస్సీ పూర్తి చేశాను. 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ సైబరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నా. మరోసారి 2022లో ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాను. ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్ తరగతులు వినేది. ఈవెండ్ల కోసం వికారాబాద్ ఎస్ఏపీ కళాశాల గ్రౌండ్, బీహెచ్ఎల్ గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేసేది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఎస్ఐగా ఉత్తీర్ణుడిని అయినందుకు సంతోషంగా ఉన్నది.
– ఏనుగు రాఘవేందర్‌రెడ్డి, గోధుమగూడ గ్రామం (వికారాబాద్)(07వికేడి01)