సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణను గాడిలో పెట్టేందుకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ప్రత్యేక దృష్టి సారించారు. ‘పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై ‘ఏడి చెత్త ఆడనే’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. స్పందించిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా జర్నలిస్టు కాలనీలోని పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లో రహదారులపై ఉన్న ప్యాచ్ వర్క్స్ చేయకుండా వదిలేసిన గుంతలను పరిశీలించారు. స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనులు చేపట్టినా ఎప్పటికప్పుడు రోడ్డు పునరుద్ధరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆదే ప్రాంతంలో వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి సంపు నిర్మించేందుకు అనువైన ప్రాంతాన్ని చూడాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. వ్యర్థాలు ఎక్కువగా ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో రెండు షిప్టుల్లో చెత్త సేకరణ జరపాలని అధికారులకు దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు.
కార్మికులతో ఇంటరాక్షన్
వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న గార్బేజీ వనరబుల్ పాయింట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 45, రోడ్ నం. 70 గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్‌నగర్ బస్తీ, ఫిలింనగర్, పీఈటీ పార్కు ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలను దానకిశోర్ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్ఎఫ్ఏ, పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనితీరును వివరాలు ఆరా తీశారు. కార్మికుల హాజరు తదితర వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలుంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలని కార్మికులకు దానకిశోర్ చెప్పారు. పనివేళల్లో తప్పనిసరిగా యూనిఫాం, హ్యాండ్ గ్లౌజ్‌లు ధరించి రక్షణ చర్యలు పాటించాలన్నారు. నగరంలో చెత్త ఎక్కువగా ఉత్పన్నమయ్యే ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అలాంటి ప్రాంతాల్లో రెండు షిప్టుల్లో చెత్త సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న నీటి నిల్వ సంపుల పనులను పరిశీలించారు.