ఉమ్మడి పాలనలో ఉన్న అరకొర కరెంట్ సమస్య మళ్లీ వచ్చింది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ వల్ల అన్నదాతలు బోరుబావుల కాడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లొచ్చింది. ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి రెండు, మూడు గంటలు ఇచ్చే కరెంట్‌తో జనం గోస తీసిండ్రు. పనులూ నత్తనడకన సాగినయ్. సాగు భూములు నెర్రెలు బారినయ్. రైతన్నలు కండ్ల నుంచి కన్నీటి ధారలు పారినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణాలతో పుష్కలంగా నీళ్లు, నిరంతర కరెంట్‌తో పదేండ్లు ఎవుసం పండుగలా సాగింది.
రాత్రిపూట పొలం కాడికి పోయే బాధ తప్పింది. రైతన్నలకు కొండంత అండగా నిలిచి, బతుకులకు భరోసా ఇచ్చిన పెద్ద సారుపై నిందలేయడం సరికాదు. మళ్లీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చింది.. అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. యాసంగి కరెంట్ కటకటతో అంతంత మాత్రంగానే పంటలు పండడంతో తీవ్ర ఆందోళనకు గురైనమ్. ఈ వానకాంలోనైనా సరిపడా కరెంట్ ఇస్తే ఎవుసం గట్టెక్కుతదని అన్నదాతలు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. అన్నదాతలను ఆగం చేసే కాంగ్రెస్ పాలన మాకొద్దంటూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
– న్యూస్ నెట్ వర్క్, నమస్తే తెలంగాణ
అరకొర కరెంట్‌తో యాసంగి పంటలు ఆగమైనయ్.. వానకాలంలోనూ ఎవుసం సాగడం కష్టమే. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు సమస్య పరిష్కారాన్ని.. రైతుల బాధను పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి గ్రామాల్లో సింగిల్ ఫేస్ కరెంటు రాక రాత్రి అంతా నిద్ర లేక ఇబ్బంది పడుతున్నాం. రైతులు మరో ఉద్యమం చేయడం ఖాయం
– సంపల్లి మల్లేశ్, మోత్కూర్ గ్రామం, దోమ మండలం
కేసీఆర్ హయాంలో ఎవుసం పండుగైంది. 24 గంటలూ కరెంటు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కరెంటు కష్టాలు మొదలైనయ్. పరిశ్రమలకూ సరైన విద్యుత్తు అందక పనులు ఆగుతున్నయ్. కరెంట్ కోతలతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల కోసం ఆలోచించి నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలి. పదేండ్లుగా కరెంట్ బాధలు తెల్వలే. రైతన్నల బతుకులు బాగు చేసిన కేసీఆర్‌పై లేని పోని ఆరోపణలు చేయడం సరికాదు.
– శేఖర్ రైతు, పూడూరు గ్రామం, మండలం
విద్యుత్తు సరఫరా లేక వ్యవసాయ దారులతో పాటు, చిరు వ్యాపారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టమంటే తెల్వకపోయేది. కాంగ్రెస్ వచ్చినకాడి నుంచి కథ మొదటికొచ్చింది. ప్రజాపాలన అంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఎలా..
– మందిపల్ వెంకట్, మాజీ ఎంపీటీసీ మందిపల్, కులకచర్ల
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే గృహాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరిగింది. పెట్టుబడి సాయం సకాలంలో అందేది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రోజుకు కనీసం ఐదారుసార్లు కరెంట్ పోతున్నది. పెట్టుబడి సాయం సమయానికి అందడం లేదు. రైతులు ఏ ఇబ్బందులు పడినా పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ పాలన కంటే గత బీఆర్ఎస్ పాలనే మంచిగుండే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుని నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలి.
– కంబాలపల్లి అనిల్, ఆమనగల్లు మున్సిపాలిటీ
కేసీఆర్ పాలనలో నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి చినుకులు పడినా కరెంట్ తీసేస్తున్నారు. మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. కరెంటోళ్లకు ఫోన్ చేస్తే లైన్ ట్రిప్పు అయి కరెంటు పోయిందని చెబుతున్నారు. కేసీఆర్ ఆధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇబ్బందులు ఉండేవి కావు. మళ్లీ కరెంటు కష్టాలు మొదటికి వచ్చాయి.
– దండు సత్యం, చేవెళ్ల గ్రామం
కాంగ్రెస్ పాలన వచ్చాక కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామంటున్న కాంగ్రెస్ నాయకుల మాటల్లో నిజం లేదు. కరెంట్ విషయంలో కేసీఆర్‌ను మరచిపోలేం. కేసీఆర్ హయాంలో 24 గంటలు ఉండేది. విద్యుత్తు సమస్యలు అంటే ఎంటో రైతులకు తెలిసేది కాదు. బోరు, బావి మోటర్లతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండినయ్. వ్యవసాయం పండుగలా సాగింది. ఇప్పుడు మళ్లీ ఎవుసం దండుగయ్యే కాలమొచ్చింది.
– రాంప్రసాద్, ఊరెళ్ల గ్రామం, చేవెళ్ల మండలం