ఇబ్రహీంపట్నం, జూన్ 23 : రైతులందరికీ రైతుభరోసా ఇచ్చేవరకూ తమ పోరాటం, నిరసనలు ఆగవని బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, సహకార సంఘం చైర్మన్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో శివారు గ్రామాల్లో ఉన్న రైతులందరికీ రైతుభరోసా అందించాలని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహ నం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ హయాంలో అర్హులందరికీ రైతుభరోసా సాయం అందిందని.. కానీ, కాంగ్రెస్ పార్టీ కొన్ని మండలాల్లోని రైతులకు కోత విధించడం తగదని హెచ్చరించారు. రైతులందరికీ రైతుభరోసా అందించే వరకూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు రాం రెడ్డి, శేఖర్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతులందరికీ రైతుభరోసాను తక్షణమే అందించాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సామ్యూల్ మాట్లాడుతూ.. ఔటర్‌రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న జిల్లాలోని 9 మండలాల్లోని రైతులకు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జంగయ్య, జగన్, బుగ్గరాములు, ఎల్లేశ్, గణేశ్, వెంకటేశ్, నర్సింహ, భిక్షపతి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.