ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరాఫ్‌గా మారిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సర్పంచ్ రవణమోని మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమక్షంలో ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు గతంలో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తామని.. అసత్య పథకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలంతా బీఆర్ఎస్ వెనకే ఉన్నారని, మరోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీని నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ గెలుపుతోపాటు పథకాలపై ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సమక్షంలో సుమారు 150 మంది కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు ఐలేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ వెంకటేశ్, మాజీ సర్పంచ్ నర్సింహ, వార్డు మెంబర్లు, నాయకులు పాల్గొన్నారు.
పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపునిస్తాం
ధారూరు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఘనమైన అభివృద్ధి జరుగుతున్నదని, గులాబీ గళమే తెలంగాణకు బలమని, పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపునిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ మహిపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వి.నర్సింహులు, బీసీ ప్రెసిడెంట్ కె.నర్సింహులు, బీజేపీ నుంచి బి.సాగర్, డి.అంజి వారి అనుచరులు, పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ధారూరు మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులున్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి
బొంరాస్‌పేట : గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మేడిచెట్టుతండాకు చెందిన కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
అభివృద్ధి నిరోధకుల ఆటలు సాగవు
ఆమనగల్లు : మాయమాటలు, కల్లబొల్లి కథలు చెప్పి పబ్బం గడుపుకొంటూ ఆమనగల్లు అభివృద్ధిని అడ్డుకుంటున్న అభివృద్ధి నిరోధకుల ఆటలు ఇక సాగవని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విమర్శించారు. ఆమనగల్లు 5, 6 వార్డులకు చెందిన దాదాపు 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో గతంలో ఓ పదవి చేపట్టిన బీజేపీ నాయకుడు ఆచారికి ఆమనగల్లు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండి ఉంటే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఎందుకు తీసుకురాలేదని ఆయన విమర్శించారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి గతంలోనే టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.15 కోట్లు కేటాయించానని.. దానితో ఆమనగల్లులోని 15 వార్డుల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆమనగల్లు ప్రభుత్వ దవాఖానను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతూ భవన నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు చేయిస్తే జీవోకు, ప్రొసీడింగ్‌కు తేడా తెలియని నాయకుడు నకిలీ ప్రొసీడింగ్ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలను నెరవేరుస్తున్నాం
2018 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, ఏడీఏ కార్యాలయం మంజూరు చేయించామని తెలిపారు. రూ.4.50 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో ఉందని, రూ.1.50 కోట్లతో మాడల్ గంథ్రాలయం నిర్మించామని.. త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆమనగల్లు సురసముద్రం చెరువు మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి రూ.8.50 కోట్లు మంజూరు చేశానన్నారు. తలకొండపల్లి నుంచి ఆమనగల్లు వరకు రూ.37 కోట్లతో రహదారి విస్తరణ చేపట్టామన్నారు. ఆమనగల్లులోని 6వ వార్డులో అంతర్గత మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గృహలక్ష్మి కింద మున్సిపాలిటీకి 300, మండలానికి 250 ఇండ్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలలోని కోనాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు.