షాబాద్, ఆగస్టు 28 : మండల కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీ నాయకుల నుంచే నిరసన సెగ తగిలింది. గత పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా ఒక్క వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్ మండలానికి రాగా.. సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు.
గోబ్యాక్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కోడిగుడ్లు, టమాటలు, వాటర్ బాటిళ్లతో ఆయన కారుపై దాడి చేశారు. పదేండ్లుగా కాంగ్రెస్‌ను బతికించు కున్నా మమ్మల్ని కాదని.. కొంతమందిని మాత్రమే వెంట వేసుకుని తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు సమాధానం చెప్పే వరకు ఎమ్మెల్యేను మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లనిచ్చేది లేదని వాహనానికి అడ్డంగా పడుకున్నారు.
ఇదే సమయంలో అక్కడికొచ్చిన పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌పై కొందరు కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో అతడిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. సుమారు గంటకు పైగా కార్యకర్తలు నిరసన తెలిపినా ఎమ్మెల్యే మాత్రం కారు దిగి రాలేదు. ఎట్టకేలకు షాబాద్ సీఐ కాంతారెడ్డి నిరసనకారుల్ని సముదాయించి మీతో ఆయన్ను మాట్లాడిస్తానని వారిని అక్కడి నుంచి పంపించారు. చివరకు పటిష్ట భద్రత మధ్య ఎంపీడీవో కార్యాలయంలోకెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై చేవెళ్ల నుంచి పోటీ చేసి ఓడిపో యిన భీంభరత్, ఆయన వర్గీయులు, చాలామంది పార్టీ సీనియర్లను ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం.. పదేండ్ల కిందట కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే యాదయ్య అక్కడ రాజభోగాలు అనుభవించి, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలోకి వచ్చాడనే ఆగ్రహంతోనే కార్యకర్తలు ఈ దాడికి దిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే షాబాద్‌లో ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా వీడిపోయారు. ఇరువురి మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి..!