వికారాబాద్, డిసెంబర్ 15 : దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని డీడబ్ల్యూవో లలితకుమారి అన్నారు. శుక్రవా రం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు బ్లాక్‌గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ దివ్యాంగులను జూనియర్స్ (10 నుంచి 16ఏండ్లు), సీనియర్స్ (17నుంచి 35 ఏండ్లు) రెండు విభాగాలుగా విభజించి షాట్‌ఫుట్, జావలిన్‌త్రో, రన్నింగ్, చెస్, క్యారమ్స్ తదితర ఆటల పోటీలను నిర్వహిస్తున్న ట్లు తెలిపారు.
అన్ని అవయవాలు సక్రమంగా ఉండే వ్యక్తులు సాధించే విజయాలకంటే.. ప్రతికూలతలను అధిగమించి అసమాన విజయాలను సాధించే దివ్యాంగులకే అధిక ప్రాధాన్యముంటుందన్నారు. దివ్యాంగులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గార్డియన్లు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని సూచించారు. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా దివ్యాంగుల్లో ఆత్మస్థైరం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం మహిళా, శిశు, సంక్షేమ శాఖ తరఫున దివ్యాంగులకు అవసరమైన వసతులను కల్పిస్తూ వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదన్నారు.
జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న దివ్యాంగులందరూ రాణించాలన్నారు. అనంతరం జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి హనుమంతరావు మాట్లాడుతూ దివ్యాంగులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ అదనపు పీడీ నర్సింహులు, చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు ప్రియదర్శిని, జయరాంరేణుక, వెం కటేశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ జహీరుద్దీన్, పీఈటీలు, వికారాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విభాగానికి చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.