ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రేపు పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సుమారు రూ.260కోట్లతో నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు ఈ నెల 9న రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, అందులోభాగంగానే పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ నెల 9న మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి సబితారెడ్డి, వేముల ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఔటర్లోపలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఆయా ప్రాంతాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.146కోట్లతో శాశ్వత తాగునీటి పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తుర్కయంజాల్ మున్సిపాలిటీకి రూ.92 కోట్లు, ఆదిబట్ల మున్సిపాలిటీకి రూ.18కోట్లు, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీకి రూ.36కోట్లతో పూర్తిస్థాయి తాగునీరందించే వాటర్‌గ్రిడ్ కార్యక్రమాన్ని రాగన్నగూడ సమీపంలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అలాగే, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంసాహారాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను, ఒక్కొక్క మార్కెట్‌ను రూ.4.50 కోట్లతో చేపడుతున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో రూ.1.50కోట్లతో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన, రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.4కోట్లతో ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానా నిర్మాణానికి భూమిపూజ, రూ.2కోట్లతో ఆర్డీవో కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఇబ్రహీంపట్నం పాతబస్టాండ్ సమీపంలో రూ.3కోట్లతో షాపింగ్‌కాంప్లెక్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
రూ.25కోట్లతో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నుంచి నాగన్‌పల్లి, పోల్కంపల్లి మీదుగా అనాజ్‌పూర్‌కు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.38కోట్లతో ఇబ్రహీంపట్నం ఎలిమినేడు, పోచారం మీదుగా మంగల్‌పల్లి వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడుతారని చెప్పారు. ఆదిబట్ల నుంచి కొంగరకు వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులకు ప్రభుత్వం రూ.3.90కోట్లను కేటాయించిందని ఈ నిధులతో పనులను ప్రారంభిస్తారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని లక్ష్మీ మెగా టౌన్షిప్లో రూ.5కోట్లతో అంతర్గత రోడ్ల మరమ్మతు పనులకు శంకుస్థాపన, రూ.3కోట్లతో తుర్కయంజాల్ మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సాగర్ రహదారి పక్కన భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.